ఆ పరిస్థితి తేవొద్దు… – మంత్రులతో జగన్‌

కేబినెట్‌ భేటీలో సహచర మంత్రులకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. మంత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోపణలకు తావు ఇవ్వొద్దని కోరారు. అవినీతి వ్యవహారాల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని సూచించారు. నాలుగు నెలల్లో దాదాపు మంత్రులంతా బాగా పనిచేశారని.. ఒకరిద్దరిపై చిన్నచిన్న ఆరోపణలు వచ్చాయని వాటికి కూడా అవకాశం ఇవ్వొద్దని కోరారు.

టీడీపీ తరపున పనిచేస్తున్న కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు పనిగట్టుకుని తప్పులను వెతికే పనిలో ఉన్నాయని సీఎం వ్యాఖ్యానించారు. చిన్నతప్పిదం జరిగినా దాన్ని బూతద్దంలో పెట్టి ప్రచారం చేస్తున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని… నిజాయితీగా ఉంటే వారు చేసేదేమీ ఉండదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

చిన్నచిన్న తప్పులు జరిగినా దాన్ని విపరీతంగా ప్రచారం చేసి చర్యలు తీసుకునేలా తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని… ఆ పరిస్థితే వస్తే తనకు బాధగా ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు. కాబట్టి మంత్రులు ఇదే తరహాలో నిజాయితీగా పనిచేయాలని జగన్‌ కోరారు.

ఇసుక సమస్యను ఒక మంత్రి ప్రస్తావించగా… ఇసుక దోపిడికి అలవాటు పడ్డవారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. ఇసుక దోపిడిని పూర్తిగా అరికట్టి వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వానికే వచ్చేలా పాలసీని తెచ్చామని… కానీ ఇంతలో భారీగా వరదలు రావడంతో ఇసుకను నదుల నుంచి బయటకు తీయలేని పరిస్థితి వచ్చిందని సీఎం వివరించారు. వరదల కారణంగా పరిస్థితి ఎవరి చేతుల్లోనూ లేకుండాపోయిందన్నారు. ఎవరికి వారే ఇసుకను తీసుకెళ్లే అవకాశం ఇస్తే తిరిగి మాఫియా రెచ్చిపోతుందని.. కాబట్టి కొద్ది రోజులు ఓపిక పడితే భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందని జగన్ వివరించారు.

నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించాలని మంత్రి అంజాద్ భాష కోరగా… చంద్రబాబునాయుడు వెళ్తూవెళ్తూ ఏకంగా 65వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టేసి వెళ్లారని… వాటిని సర్దుబాటు చేయడానికి తాను తలకిందుల తపస్సు చేయాల్సి వస్తోందని… ఆర్థిక శాఖ వర్గాలు కూడా పరిస్థితిని చక్కదిద్దేందుకు అల్లాడిపోతున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. అయితే ఒక్కో నియోజక వర్గానికి కోటి రూపాయల చెప్పున విడుదల చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గనకు సీఎం సూచించారు.

కనీసం రెండు కోట్లు ఇస్తే బాగుంటుందని మరో మంత్రి విజ్ఞప్తి చేయగా… ప్రస్తుతానికి కోటి రూపాయలు ఇస్తామని వాటితో నియోజకవర్గంలో పనులు చేయాలని బుగ్గన సూచించారు.