ఏడుపు దీక్షలకు చెల్లు… నవంబర్‌ 1న ఏపీ అవతరణ దినోత్సవం…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత అవతరణ దినోత్సవం లేకుండా నడుస్తున్న రాష్ట్రానికి నవంబర్‌1ని అవతరణ దినోత్సవంగా జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్ర విభజన తర్వాత సీఎం అయిన చంద్రబాబు అవతరణ దినోత్సవాన్ని ప్రకటించకుండా… జూన్‌ 2న నవనిర్మాణ దీక్షలు అంటూ చేస్తూ వచ్చారు. వారం పాటు రాష్ట్రం విడిపోవడంపై కన్నీరు కారుస్తూ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలం గడిపారు. ఈ దీక్షలకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ ఎలాంటి ఉపయోగం లేకుండా చేశారు. ప్రజల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఒక దారి చూపలేకపోయారు.

కొత్తగా ఏర్పడిన జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నవంబర్‌ 1ని ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినంగా నిర్వహించబోతోంది.

గత ప్రభుత్వమే ఏపీకి ఎప్పుడు అవతరణ దినం జరుపుకోవాలో చెప్పాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ఒరిజనల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.

దేశంలో ఏర్పడిన పలు కొత్త రాష్ట్రాలు … విడిపోయిన తేదీన అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాయని… ఒరిజినల్ రాష్ట్రాలు మాత్రం పాత తేదీతోనే అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాయని గుర్తు చేసింది. కాబట్టి ఏపీ కూడా దాన్నే ఫాలో కావాలని సూచించింది. కానీ చంద్రబాబు మాత్రం జూన్‌ రెండున నిర్మాణ దీక్షలకే మొగ్గు చూపారు.

నవంబర్‌1న జరిగే ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై ఈనెల 21న సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.