ఆర్పీ పట్నాయక్‌ కెమెరామెన్‌కు టోకరా… 1.7 కోట్లు వసూలు

సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వద్ద కెమెరామెన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌ను, అతడు బంధువులను ఒక మహిళ మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో కోటి 70 లక్షలు వసూలు చేసి నకిలీ ఉద్యోగ నియామక పత్రాలను చేతిలో పెట్టింది.

ఆర్పీ కెమెరామెన్ హైదరాబాద్ మణికొండలోఉంటున్నాడు. అతడి ఎదురింటిలోకి ఇటీవల గొంతిన దినేష్‌ వ్యక్తి కుటుంబం దిగింది. ఆర్పీ పట్నాయక్ కెమెరామెన్‌తో పరిచయం పెంచుకున్న దినేష్‌… తన తల్లి ఆంధ్రా యూనివర్శిటీలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారని నమ్మించాడు. వర్శిటీలో ఉద్యోగాలను తన తల్లి గొంతిన సత్య భర్తీ చేస్తుంటారని చెప్పాడు. డబ్బులిస్తే నీకు కూడా ఉద్యోగం ఇప్పిస్తానని రాజశేఖర్‌ను నమ్మించాడు. దినేష్ మాటలు నమ్మిన రాజశేఖర్ తనతో పాటు తన బంధువులైన 11 మందికి ఉద్యోగాలు ఇప్పించాలంటూ కోరారు. అలా 12 మంది నుంచి దినేష్, గొంతిన సత్యలు కోటి 70 లక్షలు వసూలు చేశారు.

ఏయూలో పలు ఉద్యోగాల్లో వారిని నియమించినట్టు పాత గవర్నర్ నరసింహన్‌ సంతకంతో నియామక పత్రాలను సృష్టించి వారి చేతుల్లో పెట్టారు. ఆ తర్వాత ఉద్యోగంలో వచ్చి చేరాల్సిందిగా ఏయూ వీసీ పేరుతో ఫేక్ ఐడీ ద్వారా మొయిల్ పంపారు. రాజశేఖర్ ఈ విషయాన్ని ఆర్పీ పట్నాయక్‌కు కూడా చెప్పి సంబరపడ్డాడు.

ఈ నేపథ్యంలో ఆర్పీ పట్నాయక్, తన కెమెరామెన్‌ రాజశేఖర్‌తో కలిసి విశాఖ వెళ్లారు. అక్కడ ఆర్పీ పట్నాయక్‌ను వైసీపీ నేత దివాకర్‌ కలిశారు. మాటల మధ్యలో తన కెమెరామెన్‌కు ఆంధ్రా యూనివర్శిటీలో ఉద్యోగం వచ్చిందంటూ ఆర్పీ పట్నాయక్ వివరించారు. రాజశేఖర్‌ తనకు వచ్చిన నియామక పత్రాలను దివాకర్‌కు చూపించాడు.

లంచాలతో ఉద్యోగం రావడం ప్రస్తుతం అయ్యే పనికాదే అని అనుమానించిన వైసీపీ నేత దివాకర్‌… ఆ నియామక ప్రతాలను ఆంధ్రా వర్శిటీ వీసీ ప్రసాద్‌కు పంపించారు. దాంతో వీసీ ఆ నియామక పత్రాలన్నీ బోగస్‌ అని తేల్చారు. దాంతో ఆర్పీ పట్నాయక్ కెమెరామెన్ కంగుతిన్నారు. తనను మోసం చేసిన దినేష్, గొంతిన సత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.