Telugu Global
NEWS

సమ్మె పరిణామాలపై హైకోర్టు సీరియస్

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల తలెత్తుతున్న పరిణామాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. ఎందుకు కార్మికులతో చర్చలు జరపడం లేదని నిలదీసింది. ఇందుకు స్పందించిన ప్రభుత్వం… కార్మికుల డిమాండ్లను నెరవేర్చే స్థితిలో ప్రభుత్వం లేదని… ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం వివరించింది. విలీనం అంశంపై కాకుండా మిగిలిన అంశాలపైనైనా ఎందుకు చర్చలు జరపడం లేదని కోర్టు ప్రశ్నించింది. కార్మికులు విలీనం అంశంపైనే […]

సమ్మె పరిణామాలపై హైకోర్టు సీరియస్
X

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల తలెత్తుతున్న పరిణామాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. ఎందుకు కార్మికులతో చర్చలు జరపడం లేదని నిలదీసింది.

ఇందుకు స్పందించిన ప్రభుత్వం… కార్మికుల డిమాండ్లను నెరవేర్చే స్థితిలో ప్రభుత్వం లేదని… ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం వివరించింది. విలీనం అంశంపై కాకుండా మిగిలిన అంశాలపైనైనా ఎందుకు చర్చలు జరపడం లేదని కోర్టు ప్రశ్నించింది. కార్మికులు విలీనం అంశంపైనే పట్టుబడుతున్నారని… విలీనం అంశం కాకుండా ఇతర అంశాలపై చర్చలకు వారు ముందుకు రావడం లేదని ప్రభుత్వం వివరించింది.

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ నివేదికను కోర్టుకు సమర్పించిన ప్రభుత్వం… బంద్‌ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ ప్రస్తుతం పీకల్లోతు నష్టాల్లో ఉందని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఏడాదికి 12 వందల కోట్ల నష్టం వస్తోందని వెల్లడించింది. చర్చల మధ్యలో సమ్మెకు దిగడం ద్వారా కార్మిక సంఘాలు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికుల జీతాలు 67 శాతం పెరిగాయని ప్రభుత్వం వివరించింది.

సంస్థ ఆదాయానికి, వ్యయానికి మధ్య భారీగా వ్యత్యాసం ఉందని…. కాబట్టి కార్మికుల డిమాండ్లను పరిష్కరించడం సాధ్యం కాదని ప్రభుత్వం నివేదించింది. ఏడాదికి ఆర్టీసీ ఆదాయం 4వేల882 కోట్లు ఉండగా… ఖర్చు మాత్రం 5వేల 811 కోట్లు ఉంటోందని ప్రభుత్వం వివరించింది. పైగా పండుగ సీజన్‌లో సమ్మె చేయడం వల్ల సంస్థ మరింత నష్టపోయిందని ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది.

కార్మికులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటి అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజలు చాలా శక్తివంతులని… వారు తిరిగబడితే ఆపే శక్తి ఎవరికీ ఉండదని వ్యాఖ్యానించింది. కొత్త ఆర్టీసీ ఎండిని నియమించినంత మాత్రాన సమస్య పూర్తిగా పరిష్కారం అయినట్టు కాదని హైకోర్టు అభిప్రాయపడింది.

రేపటి బంద్‌కు టీఎన్‌జీవోలు, ప్రైవేట్ క్యాబ్స్‌ కూడా మద్దతు తెలిపాయని ఈపరిస్థితిని ఎలా ఎదుర్కొంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కార్మికుల డిమాండ్‌లలో 50 శాతం వరకు పరిష్కరించదగినవేనని కోర్టు అభిప్రాయపడింది.

First Published:  18 Oct 2019 4:58 AM GMT
Next Story