ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అరెస్టు.. పరిస్థితి ఉద్రిక్తం..!

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 14వ రోజుకు చేరింది. రేపు తలపెట్టిన తెలంగాణ బంద్ విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం వ్యూహం రచిస్తోంది.

ఈ నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన్ భవన్‌లో అఖిలపక్షంతో చర్చలు జరపడానికి వస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్ రాజిరెడ్డి, వెంకన్నలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ప్రభుత్వం బందు విఫలం కావడానికే అరెస్టులు చేయిస్తోందని జేఏసీ నాయకులు అంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాటం కొనసాగిస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

ప్రభుత్వం మొండివైఖరి వీడి వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెను కార్మికులంతా కలసి జయప్రదం చేయాలని ఆయన కోరారు. అరెస్టులతో సమ్మెను విఫలం చేయలేరని ఆయన అన్నారు.