చంద్రబాబు దగ్గర ఏముందని స్నేహం చేయాలి ?

బీజేపీతో పోటీ పడే సత్తా ఇప్పుడు దేశంలో ఏ పార్టీకి లేదన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కుల, ప్రాంత రాజకీయాలతో ఎవరైనా బీజేపీని అధిగమించాలనుకుంటే అయ్యే పని కాదన్నారు. కులాల ప్రతిపాదికన విశ్లేషణలు ప్రస్తుతం దేశంలో పనిచేయడం లేదన్నారు. దేశం కొత్త పంథాలో పయణిస్తోందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పాత ధోరణి రాజకీయాలు కులం, కుటుంబం ఆధారంగా నడుస్తున్నాయన్నారు. ఓడిపోయిన 10 మంది టీడీపీ నేతలు వస్తే బీజేపీ బలోపేతం అవుతుందన్న భ్రమలో తాము లేమన్నారు జీవీఎల్. బీజేపీ… నాయకత్వం వల్ల, ప్రజల్లో ఉన్న విశ్వాసం ఆధారంగానే తమ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఓడిపోయిన పది మంది నేతల వల్లే పార్టీలు బలపడే అవకాశం ఉంటే తెలుగు దేశం పరిస్థితి ఈరోజు ఇలా ఎందుకు ఉంటుందని జీవీఎల్ ప్రశ్నించారు.

కొందరు నేతలు వారి భవిష్యత్తును కాపాడుకునేందుకే బీజేపీలోకి వస్తున్నారన్నారు. అలాంటి నేతలు రాకపోయినా బీజేపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. బీజేపీతో పొత్తు తెంచుకుని తప్పు చేశామని చంద్రబాబు ఇప్పుడు చెప్పడం… భవిష్యత్తుపై ఆయనకు ఉన్న భయాన్ని సూచిస్తోందన్నారు. చంద్రబాబు సొంతంగా ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన ఉదంతాలు ఎన్నడూ లేవన్నారు.

అసలు చంద్రబాబుతో స్నేహం చేయాల్సిన అవసరం బీజేపీకి ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబును దగ్గరకు తీసుకోవడానికి ఆయన వద్ద ఏముందని… ఏం ఉపయోగం అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.