అటు ఆర్టీసి సమ్మె… ఇటు ఎన్నికల గుర్తులు…. టీఆర్ఎస్ కు కొత్త టెన్షన్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఏదీ కలిసిరావడం లేదట.. తెలంగాణ రాజకీయాల్లో అతి కీలకమైన ఉప ఎన్నికగా భావిస్తున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక… రాజకీయ వర్గాల్లో చాలా ఉత్కంఠను రేపుతుంది.

టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక కావడంల వల్ల టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్టీసి సమ్మె వల్ల ఇప్పుడు తెలంగాణ సర్కారు తీవ్ర ఇరకాటంలో పడింది. దాని ఎఫెక్ట్ గులాబీపార్టీ పై పడింది.

కానీ ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి మరో అంశం కూడా కలవరపెడుతుండడం గమనార్హం. ఈ ఎన్నికలో ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది.. ఉప ఎన్నికల బరిలో మొత్తం 28 మంది ఉన్నారు. అయితే టిఆర్ఎస్ అభ్యర్ధికి నాలుగో నెంబర్ ను ఈసీ కేటాయించింది. 5వ నెంబర్ అభ్యర్థికి ట్రాక్టర్ నడిపే రైతు గుర్తు రావడం టీఆర్ఎస్ కు శరాఘాతంగా మారింది. ఇక 6వ నెంబరు కి రోడ్ రోలర్ గుర్తును కేటాయించడం కూడా గులాబీ పార్టీని టెన్షన్ కు గురిచేస్తోంది. అయితే .. ఈ రెండు గుర్తులూ కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో తమకు పడాల్సిన ఓట్లు ఇతరులకు పడతాయేమోనన్న అందోళన గులాబీ శ్రేణులను ఇప్పుడు పట్టి పీడిస్తోందట.

ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ స్ధానాన్ని కాపాడుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. అలాగే సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన నమ్మకాన్ని కాపాడుకోవాలని బీజెపి కూడా భారీ పట్టుదలతో ఉన్నది. హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక పరిస్థితి హోరాహోరిగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గుర్తును పోలిన గుర్తులు దాని కిందే ఉండడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా పరిణమించింది.

అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ట్రక్కు గుర్తును కేటాయించడం , అది కారు గుర్తును పోలి ఉండటంతో .. ఓటర్లు అయోమయానికి గురయ్యారని, తమకు ఓటు వేయబోయి ట్రక్కు గుర్తుకు వేశారని టిఆర్ఎస్ నేతలు గతంలో పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. గెలవాల్సిన చోట్ల ఓడిపోయామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు.