కల్కీ విజయనాయుడు ఆశ్రమంలో గుట్టలు గుట్టలుగా నగదు, బంగారం…

విష్ణుమూర్తికి పదో అవతారాన్ని అంటూ ప్రజలను నమ్మించి వందల కోట్లు కూడబెట్టిన విజయనాయుడు అలియాస్ కల్కి భగవాన్‌కు సంబంధించి భారీ ఆస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. మూడు రోజులుగా ఐటీ అధికారులు కల్కి ఆశ్రమం, ఇతర కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. సౌత్ ఇండియాలో దాదాపు 40 చోట్ల దాడులు జరిగాయి.

ఆశ్రమంతో పాటు, వివిధ కార్యాలయాల్లో గుట్టలు గుట్టలుగా డబ్బు ఉండడాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. కిలోల కొద్ది బంగారం, భారీగా వజ్రాలు, కోట్ల విలువైన విదేశీ కరెన్సీ దొరికింది. ఇప్పటి వరకు ఐటీ గుర్తించిన కల్కి ఆస్తుల విలువ 500 కోట్లకు పైగా ఉంది.

దాడుల్లో 43. 9 కోట్ల హాడ్ క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. 1.8 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ దొరికింది. బంగారం 88 కేజీలు స్వాధీనం చేసుకున్నారు. 5 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు లభించాయి. ఇవన్నీ సాధారణ తనిఖీల్లో దొరికినవే.

దాడులపై ఐటీ శాఖ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. ఆధ్యాత్మికం పేరుతో అనేక మందిని ఇతడు ఆకర్షించాడని వెల్లడించింది. వారి ద్వారా భారీగా డబ్బులు వసూలు చేసి ఏపీ, తమిళనాడుతో పాటు అనేక ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడంతో పాటు, వివిధ రంగాల్లోకి విస్తరించినట్టు ఐటీ అధికారులు వివరించారు. ముఖ్యంగా విదేశీ భక్తుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్టు గుర్తించామన్నారు.

ఐటీ సోదాల నేపథ్యంలో పలు కీలకమైన ఆధారాలను ఆశ్రమ సిబ్బంది నాశనం చేసినట్టు కూడా తమ దృష్టికి వచ్చిందని ప్రకటనలో ఐటీ అధికారులు వివరించారు. కల్కి భగవాన్‌కు చైనా, అమెరికా, సింగపూర్, దుబాయ్‌లోని పలు కంపెనీల్లో వాటాలు ఉన్నట్టు ఐటీ శాఖ వెల్లడించింది. హవాలా మార్గంలో భారీగా నిధులను విదేశాలకు తరలించినట్టు అనుమానాలు ఉన్నాయని వివరించింది. ఇప్పటికీ కల్కి భగవాన్, అతడి భార్య పద్మావతి పరారీలోనే ఉన్నారు.