కబడ్డీ లీగ్ లో నేడే టైటిల్ సమరం

  • నువ్వానేనా అంటున్న ఢిల్లీ, బెంగాల్ 
  • కప్పు కొడితే 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరిస్తూ వస్తున్న ప్రో-కబడ్డీలీగ్ 7వ సీజన్ టైటిల్ సమరానికి అహ్మదాబాద్ లోని ఏకా ఎరీనా వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. తొలిసారిగా ఫైనల్స్ కు అర్హత సాధించిన బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ జట్లు ఈరోజు జరిగే ఆఖరాటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

హాట్ ఫేవరెట్ ఢిల్లీ…

7వ సీజన్ కబడ్డీలీగ్ లో తిరుగులేని విజయాలు సాధిస్తూ నాకౌట్ రౌండ్ కు దూసుకొచ్చిన ఢిల్లీ దబాంగ్ జట్టు…తొలి సెమీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ ను 44-38 పాయింట్లతో కంగు తనిపించడం ద్వారా తొలిసారిగా ఫైనల్స్ బెర్త్ సంపాదించింది.

ఆట మొదటి భాగానికే 26- 18 పాయింట్లతో పైచేయి సాధించిన ఢిల్లీ…రెండో భాగంలో సైతం అదే దూకుడు కొనసాగించింది. ఆల్ రౌండ్ గేమ్ తో ఆధిపత్యం కొనసాగించింది.

ఢిల్లీ తురుపుముక్క, సూపర్ రైడర్ నవీన్ కుమార్ అంచనాలకు తగ్గట్టుగా ఆడి తనజట్టుకు తొలిసారిగా ఫైనల్స్ లో చోటు ఖాయం చేశాడు. రైడింగ్ లో నవీన్ కుమార్ 15 పాయింట్లు సాధించగా…బ్లాకింగ్ లో అనీల్ కుమార్ 4 పాయింట్లు సంపాదించిపెట్టాడు.

బెంగాల్ వారియర్స్ జోరు..

రెండో సెమీఫైనల్లో మాజీ చాంపియన్ యూ-ముంబాయిపై బెంగాల్ వారియర్స్ సంచలన విజయం సాధించడం ద్వారా మొట్టమొదటిసారిగా లీగ్ టైటిల్ సమరానికి అర్హత సంపాదించగలిగింది.

ఆఖరి నిముషం వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో బెంగాల్ వారియర్స్ 37-35 పాయింట్ల తేడాతో యూ-ముంబాను అధిగమించింది.

విజేతకు 3 కోట్ల ప్రైజ్ మనీ…

కబడ్డీ లీగ్ 7వ సీజన్ విజేతగా నిలిచిన జట్టుకు 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని సైతం అందచేస్తారు. రన్నరప్ గా నిలిచినజట్టు కోటీ 80 లక్షల రూపాయలు ఇస్తారు.

3వ స్థానంలో నిలిచిన జట్టుకు 90 లక్షల రూపాయలు, నాలుగో స్థానం సాధించినజట్టుకు 90 లక్షలు, 5వ స్థానంలో నిలిచిన జట్టుకు 45 లక్షలు, 6వ స్థానం సంపాదించిన జట్టుకు 45 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు.

పట్నా పైరేట్స్ టాప్…

ప్రో-కబడ్డీ లీగ్ గత ఆరుసీజన్లలో అత్యధిక టైటిల్స్ సాధించినజట్టుగా పట్నా పైరేట్స్ నిలిచింది. పట్నా పైరేట్స్ మూడుసార్లు, జైపూర్ పింక్ పాంథర్స్, యూ-ముంబా, బెంగళూరు బుల్స్ జట్లు ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి.

శనివారం జరిగే టైటిల్ సమరంలో దబాంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండుజట్లలో ఏ జట్టు నెగ్గినా…విజేతల జాబితాలో మరో సరికొత్త విజేత చోటు సంపాదించినట్లవుతుంది.