మళ్లీ ఆగిన ఆర్-ఆర్-ఆర్

ఏ ముహుర్తాన స్టార్ట్ చేశారో కానీ ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మరోసారి నిలిచిపోయింది. అవును.. ప్రస్తుతం ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ జరగడం లేదు. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది.

లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను లైవ్ కన్సర్ట్ రూపంలో ప్రదర్శించబోతున్నారు. స్వయంగా సంగీత దర్శకుడు కీరవాణి, ఈ లైవ్ కన్సర్ట్ ఇవ్వబోతున్నాడు. ఇదే ఈవెంట్ లో బాహుబలి ప్రత్యేక ప్రదర్శన కూడా ఉంది.

రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఓ భారతీయ సినిమాకు ఇలా లైవ్ కన్సర్ట్ గౌరవం దక్కడం ఇదే తొలిసారి. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే లండన్ చేరుకుంది బాహుబలి యూనిట్. ఈ ఒక్క ఈవెంట్ కోసం అంత దూరం వెళ్లి, 2 రోజుల్లో మళ్లీ వచ్చేస్తే బాగుండదు. అందుకే రాజమౌళి, తన కుటుంబంతో పాటు లండన్ వెళ్లాడు. వారం రోజులు అక్కడే ఉంటాడు. దీని కోసం ఆర్-ఆర్-ఆర్ షూట్ ను మరోసారి ఆపేశారు.