సుజనా చౌదరి…. అప్పుడలా…. ఇప్పుడిలా !

సుజానా చౌదరి అనగానే ఒక వ్యాపార వేత్త, రాజ్యసభ సభ్యుడు అని గుర్తుకు వస్తుంది. అంతేకాదు.. టిడిపి సీనియర్ నాయకుడు.. చంద్రబాబుకు అత్యంత దగ్గరైన వ్యక్తిగా మొన్నటివరకు ఉండేవాడు. అయితే కాలం మారింది.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో టిడిపి అధికారం కోల్పోయింది. దీంతో  ప్రతిపక్ష పార్టీని వదిలి… అధికార పార్టీ కాషాయజెండా పట్టుకున్నారు సుజనా చౌదరి.

సుజనా చౌదరి ఇప్పుడు బీజేపీ నేత గా చలామణిలోకి వచ్చాడు. అయితే సుజనాలో వచ్చిన ఈ మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జనాలు సుజానా ఇంతలా మారిపోయాడేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు.

టిడిపిలో ఉండగా సుజనాచౌదరి టిడిపి హెడ్ క్వార్టర్స్ కే పరిమితం అయ్యేవాడు. పెద్దగా ఎక్కడా కనిపించే వాడు కాదు. రోజువారి పార్టీ పనులకు దూరంగా ఉండేవాడు. పెద్దగా ఫోకస్ అయ్యేవాడు కాదు. అయితే బీజేపీలో చేరగానే సుజనా పోలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.

బీజేపీలో అధిష్టాన నిర్ణయమే పైనల్. ఆ విషయం సుజనా చౌదరికి తొందరగానే అర్థమైనట్లుంది. అందుకనే పార్టీ ఆదేశాల మేరకు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అందులో తూచ తప్పకుండా బీజేపీ నిబంధనలను సుజనా పాటిస్తున్నాడు. కాషాయపు జెండా పట్టుకొని గల్లి గల్లీలో తిరుగుతున్నాడు. పార్టీ సభ్యత్వ నమోదు కోసం పార్టీ బుక్ ని పట్టుకొని ఇప్పుడు సుజనా చౌదరి వీధుల్లో తిరుగుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

టీడీపీలో ఉన్నప్పుడు తనే బాస్ గా వ్యవహరించిన సుజనా…. ఇప్పుడు బీజేపీలో చేరాక వంగిపోయి పనిచేస్తున్న వైనం నేతల్లో చర్చనీయంశమవుతోంది…. మొత్తానికి బీజేపీ నేతగా మారిపోవడానికి సుజనా ప్రయత్నిస్తున్నాడని… పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలాడుకుంటున్నారు.