Telugu Global
Others

ఎన్నికల రాజకీయాల ఆంతర్యం

మామూలు రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు ఇప్పటిదాకా చాలా వరకు రెండు రాజకీయ పక్షాలకే పరిమితం అయినాయి. నిజానికి ఈ రెండు రాజకీయ పక్షాలు వేరు వేరుగా కనిపించినా సారంలో ఒకే రకమైనవి. ఎన్నికల రాజకీయాలకు సంబంధించినంత వరకు ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోగలుగుతున్నామని భావిస్తారు. అభివృద్ధి, సుపరిపాలన, తీవ్ర జాతీయ వాదానికి అనుకూలంగా ఓటు వేస్తున్నామని కూడా భావించవచ్చు. అంటే ప్రజలకు ఉమ్మడి ప్రయోజనాలకోసం తమ ఓటు హక్కుని వినియోగిస్తున్నట్టు కనిపిస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాల […]

ఎన్నికల రాజకీయాల ఆంతర్యం
X

మామూలు రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు ఇప్పటిదాకా చాలా వరకు రెండు రాజకీయ పక్షాలకే పరిమితం అయినాయి. నిజానికి ఈ రెండు రాజకీయ పక్షాలు వేరు వేరుగా కనిపించినా సారంలో ఒకే రకమైనవి. ఎన్నికల రాజకీయాలకు సంబంధించినంత వరకు ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోగలుగుతున్నామని భావిస్తారు. అభివృద్ధి, సుపరిపాలన, తీవ్ర జాతీయ వాదానికి అనుకూలంగా ఓటు వేస్తున్నామని కూడా భావించవచ్చు.

అంటే ప్రజలకు ఉమ్మడి ప్రయోజనాలకోసం తమ ఓటు హక్కుని వినియోగిస్తున్నట్టు కనిపిస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఓటు వేస్తున్నామని సాధారణంగా ఓటర్లు చెప్పరు. కానీ ఎన్నికలలో పోటీ చేసే వివిధ రాజకీయ నాయకుల దృష్టి ఇలాగే ఉండకపోవచ్చు. వారు స్వప్రయోజనాలకోసమే పోటీకి దిగినా తమ ప్రయోజనాలకోసం పోటీ చేయడం లేదని, సమష్టి ప్రయోజనాలు పరిరక్షించడానికే పోటీ చేస్తున్నామని చెప్తూ ఉంటారు. ఈ వాదన చేసే రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేస్తుంటారు. వారి మద్దతు దార్లూ అదే పని చేస్తారు. అయితే రాజకీయ ఆకాంక్ష కలిగిన వారు ఎందుకు పోటీ చేస్తారు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. వారు ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడానికి కారణం ఏమిటి? ఆ కారణం వ్యక్తిగతమైందా? లేక అందరి శ్రేయస్సు కోసమా? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం మాత్రం రాజకీయ నాయకులు ఏం చెప్పినప్పటికీ సొంత ప్రయోజనాల కోసమే తప్ప సమష్టి ప్రయోజనాల కోసం కాదు అన్న సమాధానమే వస్తుంది.

ఎన్నికల రాజకీయాలు, తద్వారా దక్కే అధికారం సాధారణంగా సొంత ప్రయోజనాలు సాధించడానికే ఉపకరిస్తోంది. ఇది బహిరంగాగానూ, లేదా నర్మ గర్భంగానూ ఉండవచ్చు. ఎన్నికలలో పోటి చేసి గెలిచే వారు సమకూర్చుకుంటున్న అపారమైన సంపదను చూస్తే స్వప్రయోజనాలే ప్రధానం అనుకోవలసి వస్తోంది. ఇందులో నైతికత ప్రస్తావనే ఉండకపోవచ్చు. ప్రతిభా కనిపించక పోవచ్చు. నైతికంగా రాజీ పడకపోతే సంపద సమకూర్చుకోవడం సాధ్యం కాదు.

మామూలు రాజకీయాలైనా, ఎన్నికల రాజకీయాలైనా అంతిమంగా కనిపించేది “తమను తాము అమితంగా ప్రేమిచుకోవడమే.” ఈ ఆత్మానురాగం ప్రస్తుత సమయంలో స్వప్రయోజనాలకే ఉపకరిస్తోంది. ఈ ప్రయోజనాలు రాను రాను వేలం వెర్రిగా మారుతున్నాయి. దృశ్య రూపంలో ఊహించుకుంటే ఇది “సెల్ఫీ” లాంటిదే. అందుకే విషాద సమయంలో కూడా నాయకులు ట్విట్టర్ లో తమ గొప్ప చాటుకుంటూ ఉంటారు. తమను తాము ప్రేమించుకోవడం స్వీయ విలువగా ద్యోతకం అవుతూ ఉంటుంది.

నిజానికి స్వీయ విలువ అధికారంలో ఉన్న వారి దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగపడ్తుంది. అంటే పార్టీ టికెట్లు సంపాదించడం లాంటి వాటికి ఉపకరిస్తుంది. లేదా అధికారంలో ఏదో ప్రయోజనం పొందడానికి ఉద్దేశించిందీ కావచ్చు. ఇలాంటి సందర్భాలలో వ్యక్తిగత విలువ ఒక హక్కుగా కాకుండా అధికార వర్గాల ప్రాపకం ఏ మేరకు సంపాదిస్తున్నామన్న అంశం మీదే ఆధారపడి ఉంటుంది.

మామూలు రాజకీయాల్లో పాల్గొనే వారు హక్కుల భాషలో మాట్లాడవచ్చు. కానీ అధికార ప్రాపకం ప్రధానమైనప్పుడు ఈ హక్కులకు ఇచ్చే విలువ తగ్గుతుంది. అప్పుడు రాజకీయ చాతుర్యం లాంటివి కనుమరుగవుతాయి. అధికార ప్రాపకాన్ని అందజేసే వారు “రాజకీయ వ్యక్తిత్వాన్ని” అధికార కేంద్రంలో ఉన్న వారే అంచనా వేస్తారు. అంటే ఒక రాజకీయ నాయకుడి విలువ రాజకీయ లేదా అధికార ప్రాపకం ఏ మేరకు ఉందన్న అంశం మీదే ఆధారపడి ఉంటుంది.

వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగా స్వయం ప్రతిపత్తిని సంపాదించాలనుకున్నప్పుడు సాధారణ మానవుడి నైతిక బలం ఎంత అన్నదే ప్రధానంగా పరిగణనలోకి వస్తుంది. నైతికత దృష్టితో మనిషి విలువ ఉన్న వ్యవస్థల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి ప్రభుత్వ ఉద్యోగాల రంగంలో కావచ్చు, కనీస మద్దతు ధర కావచ్చు.

అయితే ఈ వ్యవస్థలు నిరుద్యోగ యువతకు, రైతులకు ఉపయోగపడడం ఎన్నడో ఆగిపోయింది. అయినా యువత, రైతులు తమకు విలువ ఉందనే అనుకుంటారు. అందుకే యువత, రైతులు జాతీయతావాదం మొదలైన విషయాల వేపు ఆకర్షితులవుతుంటారు. స్వీయ విలువ ఉంది అనుకున్నప్పుడు అస్తిత్వ అవసరాలు, భద్రత, సామాజిక భద్రత కనిపించకుండా పోవచ్చు.

మరో వేపు ఒక నిర్దిష్ట రాజకీయ పక్షం వారు ఈ విలువ అన్న అంశాన్ని వినియోగించుకుంటూనే ఉంటారు. దానితో పాటు తమ స్వప్రయోజనాలనూ పరిరక్షించుకుంటారు. ఈ స్వప్రయోజనం భావి తరాలకు కూడా వర్తిస్తుంది. మొత్తం మీద సమష్టి శ్రేయస్సు పేరు చెప్పి స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడం కొనసాగుతూనే ఉంటుంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  19 Oct 2019 1:00 AM GMT
Next Story