చంద్రబాబుపై విడదల రజనీ ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నేత వర్ల రామయ్యపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడు పోలీసులతో పాటు వైసీపీ నేతలు, ముఖ్యంగా వైసీపీ మహిళా నాయకులపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రజనీ, శ్రీదేవిలు గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసుల, మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు, వర్ల రామయ్య పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని… కాబట్టి వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. చంద్రబాబు , వర్ల రామయ్య చేసిన కామెంట్లను ఫిర్యాదులో వివరించారు. విశాఖ, నెల్లూరులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారని ఎమ్మెల్యే రజనీ ప్రశ్నించారు. ప్రజలు బాగుండడం చంద్రబాబుకు అస్సలు ఇష్టముండదని అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు.

పోలీసుల గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన వర్ల రామయ్యపైనా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతల తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆమె ఆరోపించారు.