మరో ఘనత సాధించిన బాహుబలి

దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎంతో ఘనత వహించింది బాహుబలి సినిమా. ఇప్పటికీ టాలీవుడ్ లో రికార్డులన్నీ ఈ సినిమావే. ఇండియా వైడ్ రికార్డులు కూడా చాలానే ఉన్నాయి. అలా చరిత్ర సృష్టించిన ఈ సినిమాకు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి మ్యూజిక్ స్కోర్ లైవ్ కన్సర్ట్ జరిగింది.

లండన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, అనుష్క, రానా, ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో బాహుబలి స్కోర్ ను లైవ్ లో ప్రదర్శించారు. ఆ తర్వాత సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. 148 ఏళ్ల చరిత్ర కలిగిన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఇంగ్లిష్ కాకుండా మరో భాషకు చెందిన సినిమాను ఇలా లైవ్ కన్సర్ట్ రూపంలో ప్రదర్శించడం ఇదే ప్రథమం. అది కూడా ఓ తెలుగు సినిమాకు ఈ అపూర్వ గౌరవం దక్కింది.

ఎప్పట్లానే ఈసారి కూడా ప్రభాస్, అనుష్కను చూసేందుకు.. రాజమౌళిని కలిసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. వీళ్లంతా లండన్ వస్తున్నారని తెలిసి, జపాన్ నుంచి ప్రత్యేకంగా బాహుబలి ఫ్యాన్స్ కూడా లండన్ వచ్చారు. యూనిట్ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు.

మరో 3 రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు రాబోతోంది. పుట్టినరోజును లండన్ లోనే సెలబ్రేట్ చేసుకోవాలని ప్రభాస్ నిర్ణయించాడు. అటు రాజమౌళి కూడా తన కుటుంబ సభ్యులతో పాటు వారం రోజుల పాటు లండన్ లోనే ఉండబోతున్నాడు. అనుష్క, రానా, శోబు లాంటి ఇతర సభ్యులు మాత్రం ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యారు.