మహేష్.. ఒక రోజు ముందే!

సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల మధ్య భారీ పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంతలా అంటే సంక్రాంతి బరిలో వస్తున్న ఈ రెండు సినిమాలు ఒకే తేదీని ఫిక్స్ చేశాయి. అది కూడా పంతాలు-పట్టింపులకు పోయి.. ఇద్దరు హీరోలు ఒకే తేదీని లాక్ చేశారు. దీంతో ఈ వ్యవహారం చుట్టూ చాలా వివాదం నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ తేదీ నుంచి మహేష్ తప్పుకున్నట్టు తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో జనవరి 12న అల వైకుంఠపురం సినిమాను విడుదల చేస్తామని బన్నీ ప్రకటించాడు. ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే మహేష్ కూడా హుటాహుటిన పోస్టర్ రిలీజ్ చేసి, తన సినిమా కూడా 12నే వస్తుందని ప్రకటించాడు. కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. సరిలేరు నీకెవ్వరు సినిమాను ఒక రోజు ముందుగా, అంటే జనవరి 11న విడుదల చేయాలని అంతర్గతంగా నిర్ణయించారట.

అయితే ఈ విషయాన్ని అప్పుడే బయటపెట్టకూడదని యూనిట్ నిర్ణయించింది. సరిగ్గా విడుదలకు 2 వారాల ముందు మరోసారి పునరాలోచించి నిర్ణయం తీసుకోవచ్చని మహేష్ చెప్పినట్టు సమాచారం. రిలీజ్ డేట్ పై కాకుండా.. సినిమాపై అందరూ దృష్టిపెట్టాలని సూచించిన మహేష్.. విడుదల తేదీ వ్యవహారాన్ని తనకు వదిలేయమని, టెన్షన్ పడొద్దని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించాడు.