నవయుగకు మరో షాక్, 4వేల 731 ఎకరాలు స్వాధీనం

నవయుగ సంస్థకు ఏపీలో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నవయుగ సంస్థకు మరో పెద్ద షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామంటూ పదేళ్ల క్రితం నవయుగ సంస్థ ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే నాలుగు వేల 731 ఎకరాల భూమిని తీసుకుంది. కానీ ఇప్పటికీ ఎలాంటి ఇండస్ట్రియల్ పార్కు పనులను ప్రారంభించకుండా భూమిని తమ వద్దే ఉంచుకుంది.

కొత్త ప్రభుత్వం మాత్రం 4వేల 731 ఎకరాల భూమిపై ఆరా తీసింది. పదేళ్లు అయినా సరే ఒప్పందం ప్రకారం ఎలాంటి పనులు మొదలుపెట్టలేదు కాబట్టి ఆ భూమిని ఎందుకు వెనక్కు తీసుకోకూడదో చెప్పాలంటూ ఇది వరకు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నెల రోజుల గడువు కావాలని నవయుగ కోరింది. అందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఆ నెల గడువు కూడా ముగిసినా నవయుగ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో నెల్లూరు జిల్లా అధికారులు భూములు స్వాధీనం చేసుకున్నారు.

భూముల కేటాయింపు సమయంలో ప్రభుత్వానికి నవయుగ సంస్థ ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లిస్తామని ఏపీఐఐసీ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న 4వేల 731 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందుతుందని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. నవయుగ సంస్థ అధినేత … ఈనాడు సంస్థల రామోజీరావులు ఇద్దరూ వియ్యంకులు.

ఇప్పటికే పోలవరం నిర్మాణం పనుల నుంచి నవయుగను తప్పించిన జగన్‌ ప్రభుత్వం… పోలవరం పనులకు రివర్స్‌ టెండరింగ్ నిర్వహించి ఏకంగా 782 కోట్లు ఆదా చేసింది. ఆ తర్వాత బందర్‌ పోర్టు నిర్మాణం కోసమంటూ నవయుగ తీసుకున్న భూములను రద్దు చేసింది.

పోర్టు నిర్మాణం కోసం పదేళ్ల క్రితం 412 ఎకరాలు తీసుకున్న నవయుగ సంస్థ… బందరు పోర్టును నిర్మిస్తే నెల్లూరు వద్ద తాను నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు ఆదాయం పడిపోతుందన్న ఉద్దేశంతో బందరు పోర్టు నిర్మాణం మొదలుపెట్టలేదన్న నిర్ధారణకు వచ్చిన జగన్‌ ప్రభుత్వం…. గత నెలలో ఆ భూమిని వెనక్కు తీసుకుంది. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు వద్ద కేటాయించిన భూములనూ స్వాధీనం చేసుకుంది.