ఈసారి విజయ్ “విజిల్” వేస్తాడా?

తన సినిమా వస్తుందంటే చాలు హైదరాబాద్ లో వాలిపోతాడు కార్తి. ఆడియో ఫంక్షన్ దగ్గర్నుంచి, ప్రత్యేక ఇంటర్వ్యూలు వరకు చాలా హంగామా చేస్తాడు. అటు కార్తి అన్నయ్య సూర్య కూడా అంతే. తన సినిమా తెలుగు రిలీజ్ కోసం ప్రత్యేకంగా కొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తాడు. కార్తి, సూర్యతో పాటు విశాల్ లాంటి కొంతమంది తమిళ నటులు తెలుగు మార్కెట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇలాంటి ప్రయత్నాలేవీ చేయకుండానే విజయ్ కు ఇక్కడ తెలుగులో మార్కెట్ క్రియేట్ అయింది.

విజయ్ నటించిన తుపాకి సినిమా తెలుగులో కూడా హిట్ అయింది. ఆయన చేసిన అదిరింది అనే సినిమా ఇక్కడ కూడా బాగానే ఆడింది. సర్కార్ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో విజయ్ అప్ కమింగ్ మూవీ విజిల్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది.

ప్రస్తుతం ‘బిజిల్’ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాను ‘విజిల్’ పేరిట తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం విజయ్ హైదరాబాద్ వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా తన సినిమాలకు తమిళ్ లోనే పెద్దగా ప్రచారం చేయడు విజయ్. ఆడియో ఫంక్షన్ కు మాత్రం హాజరవుతాడు. మీడియాను పిలిచి ఇంటర్వ్యూలు ఇవ్వడం లాంటి పనులు చేయడు.

అలాంటి హీరో తెలుగు మార్కెట్ కోసం హైదరాబాద్ వస్తాడని ఆశించడం అత్యాశే అవుతుంది. మరోవైపు కొంతమంది మాత్రం మార్కెట్ పెరిగింది కాబట్టి విజయ్, తెలుగు మార్కెట్ పై దృష్టిపెట్టే అవకాశం ఉందంటున్నారు.