ఆ పార్టీది మీడియా షో – టీడీపీపై డీజీపీ

పోలీసులపై ఇటీవల టీడీపీ అధినేత నుంచి ఆ పార్టీ నేతల వరకు పదేపదే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పోలీసులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీది అంతా మీడియా షో అని వ్యాఖ్యానించారు.

పలు అంశాలపై డీజీపీకి లేఖ రాశామంటూ ఆ పార్టీ నేతలు విడుదల చేస్తున్న లేఖలపైనా డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీజీపీకి ఫిర్యాదు చేశామంటూ సదరు లేఖలను తొలుత మీడియాకు విడుదల చేస్తున్నారని… ఆ తర్వాత రెండుమూడు రోజుల తర్వాత ఆ లేఖలను తీసుకొచ్చి టీడీపీ నేతలు తనకు ఫిర్యాదు చేస్తున్నారని డీజీపీ వివరించారు. వెంటనే ఎలాంటి అంశాన్ని తమ దృష్టికి తెచ్చినా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

టీడీపీ నేతలను తాను కలవడం లేదన్నది అవాస్తవమన్నారు. ఇప్పటి టీడీపీ నేతలు మూడు సార్లు వచ్చారని… రెండు సార్లు వారితో మాట్లాడానని వెల్లడించారు. మరోసారి టీడీపీ నేతలు వచ్చినప్పుడు వేరే మీటింగ్‌లో ఉండడం వల్ల తాను కలవలేకపోయానని… అది తన దురదృష్టం అని వ్యాఖ్యానించారు.

తాను ప్రజాసేవకుడిని మాత్రమేనని… అంతకు మించి తనకు రాజకీయంగా ఎలాంటి పాత్ర ఉండదన్నారు. పోలీసులపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను కేవలం రాజకీయ ఆరోపణలుగా మాత్రమే తాను చూస్తానని డీజీపీ చెప్పారు.