మోడీకి పూరి జగన్నాథ్‌ లేఖ

ప్రధాని మోడీకి దర్శకుడు పూరి జగన్నాథ్ లేఖ రాశారు. పర్యావరణానికి సంబంధించి ఈ లేఖ రాశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను బ్యాన్‌ చేస్తామన్న ప్రధాని ప్రకటనపై పూరి విభేదించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించినంత మాత్రాన పర్యావరణం బాగుపడదని… పర్యావరణం దెబ్బతినడానికి ప్లాస్టిక్ అన్నది ఒక కారణమే గానీ… పూర్తిగా అదే కారణం కాదన్నారు.

1960 నుంచి ప్లాస్టిక్ వాడకం బాగా పెరగడం వల్ల కాగితపు సంచుల వాడకం బాగా తగ్గిపోయిందని… దాంతో కాగితపు సంచుల కోసం చెట్లను, అడవులను నాశనం చేయాల్సిన పని లేకుండా పోయిందన్నారు. మళ్లీ ఇప్పుడు ప్లాస్టిక్‌ను నిషేధించి కాగితపు సంచుల వైపు వెళ్తే వాటి తయారీ కోసం అడవులను నాశనం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

చెట్లను నరకాల్సి వస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పూరి అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్‌ను వాడేసి ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్లే ఇబ్బంది వస్తోందని… అలా కాకుండా వాడేసిన ప్లాస్టిక్‌ను రిసైక్లింగ్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇందు కోసం ప్రభుత్వం ప్లాస్టిక్ రీ- సైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి… వాడేసిన ప్లాస్టిక్ తెచ్చే వారికి డబ్బులిచ్చి ప్రోత్సహించాలని సూచించారు. అలా చేస్తే కొత్తగా ప్లాస్టిక్‌ ముప్పు పెరిగే అవకాశం ఉండదని పూరి జగన్నాథ్ తన లేఖలో వివరించారు.