4 గంటల్లో జరిగే కథ ఇది

మరో కొత్త సినిమాతో మనముందుకు రాబోతున్నాడు కార్తి. దీపావళి కానుకగా ఖైదీ సినిమాను విడుదలకు సిద్ధంచేసాడు. ఈ సినిమా ప్రచారాన్ని ముందుగా టాలీవుడ్ నుంచి షురూ చేశాడు ఈ హీరో. త్వరలోనే కోలీవుడ్ లో ప్రమోషన్ మొదలుపెడతాడట. కెరీర్ లో చాలా ప్రయోగాలు చేసిన కార్తి, ఖైదీతో కూడా మరో ప్రయోగం చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఇది 4 గంటల్లో జరిగే కథ అంటున్నాడు ఈ హీరో.

“ఈ సినిమా పూర్తిగా 4 గంటల్లో జరిగే కథ. నాకు బాగా నచ్చిన అంశం కూడా ఇదే. ఓ ఖైదీ జీవితంలో 4 గంటల్లో ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ. కేవలం ఖైదీ చుట్టూ తిరిగే కథ కాదు ఇది. ఇందులో తండ్రికూతుళ్ల మధ్య వచ్చే ఓ మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. పదేళ్ల నుంచి కూతుర్ని చూడని ఓ తండ్రికి, పాపను చూసే అవకాశం వస్తుంది. అదేంటనేది ఈ ఖైదీ.”

ఈ సినిమాలో నటిస్తుంటే చాలా సందర్భాల్లో తనకు కన్నీళ్లు వచ్చేశాయంటున్నాడు కార్తి. ఎందుకంటే నిజజీవితంలో తను కూడా ఓ కూతురికి తండ్రినని, అందుకే ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యానని చెబుతున్నాడు. తనలో నటన కాకుండా, తన నిజజీవిత లక్షణాల్ని సినిమాలో చూస్తారని చెబుతున్నాడు.

అంతా బాగానే ఉంది కానీ, ఖైదీ అయినా కార్తీకి కలిసొస్తుందా అనేది పెద్ద డౌట్. ఈహీరో ఈమధ్య వరుసగా ఫ్లాపులిస్తున్నాడు. కమర్షియల్ గా చేసిన సినిమాలేవీ ఆడలేదు. అందుకే ఇప్పుడిలా మరోసారి డీ-గ్లామరైజ్డ్ పాత్రతో ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమా క్లిక్ అయితేనే కార్తి మార్కెట్ ఉంటుంది. లేదంటే అతడి మార్కెట్ మరింత పడిపోతుంది.