మహారాష్ట్ర ఎన్నికలు.. అభ్యర్థిపై కాల్పులు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం నుంచి జరుగుతోంది. అయితే అమరావతి జిల్లాలో ఒక హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన స్వాభిమాని పక్ష పార్టీకి చెందిన దేవేంద్ర భుయార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు భుయార్ తన అనుచరులతో కలసి కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు.

బైక్‌పై ముగ్గురు దుండగులు వచ్చి కారును అడ్డగించి భుయార్‌ను బయటకు లాగారు. అనంతరం ఆయనపై కాల్పులు జరిపి.. కారుకు నిప్పు పెట్టారు. ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయారు.

గాయపడిన భుయార్‌ను ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.