ఊహించిందే జరిగింది…. సి-సెంటర్లలో ఆడుతోంది

అంతా ఊహించినట్టే జరిగింది. రాజుగారి గది3 సినిమా చూసిన తర్వాత విశ్లేషకులు ఏదైతే అభిప్రాయపడ్డారో అదే జరుగుతోంది. ఈ సినిమా కామెడీ సి-సెంటర్ ఆడియన్స్ కు మాత్రమే ఎక్కింది. ప్రస్తుతం వసూళ్లు అక్కడ్నుంచే వస్తున్నాయి. తర్వాత స్థానంలో బి-సెంటర్ థియేటర్లు ఉన్నాయి. మల్టీప్లెక్సుల్లో పూర్తిగా పడిపోయింది రాజుగారి గది 3 సినిమా.

నిన్నటితో మొదటి వారంతం పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. సినిమాను జస్ట్ 3 కోట్ల 75 లక్షల రూపాయలకు అమ్మడంతో.. ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వడం, లాభాల్లోకి రావడం ఇక లాంఛనం మాత్రమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 2 రోజుల్లో ఈ సినిమా లాభాల బాట పడుతుంది. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇది పూర్తిగా సి-సెంటర్ మూవీ.

మరోవైపు రాజుగారి గది3 సినిమాతో పాటు విడుదలైన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ పూర్తిగా ఫెయిలైంది. విడుదలైన ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు ఏపీ,నైజాంలో కలిపి కేవలం 75 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను కూడా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలకు అమ్మారు. సో.. ఇది బ్రేక్-ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది.