రేవంత్ కోసం పోలీసులు గాలింపు.. ట్విట్టర్‌లో కేసీఆర్‌‌కు హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు కాంగ్రెస్ ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు.

ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ వంటి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

ఇక రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. కాని రేవంత్ రెడ్డి అక్కడ లేరు. దీంతో ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. రేవంత్ ఎక్కడ కనపడ్డా అరెస్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఒకవైపు పోలీసులు తన కోసం గాలిస్తుంటే.. రేవంత్ అజ్ఞాతం నుంచే ట్విట్టర్ ద్వారా సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. ”మెట్రో రైల్, ప్రగతి భవన్ గేట్లు మూసుకుని కూర్చున్న కెసిఆర్ ఖబడ్ధార్ ! అంజన్ యాదవ్ , రాములు నాయక్ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నా. తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.” అంటూ ట్వీట్ చేశారు.