పెళ్లి కోణంలో హీరోయిన్లను చూడకండి

పెళ్లి ఎప్పుడు అనే ఒకే ఒక్క ప్రశ్న అడిగినందుకు మీడియాకు క్లాస్ పీకింది మిల్కీబ్యూటీ తమన్న. ఎప్పుడూ పెళ్లి గురించి తప్ప మరో ప్రశ్న దొరకదా అన్నట్టు పరోక్షంగా దెప్పిపొడిచింది. అసలు హీరోయిన్లు కనిపిస్తేనే పెళ్లి ప్రస్తావన ఎందుకొస్తుందో అర్థంకావట్లేదంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది మిల్కీబ్యూటీ.

“మహిళల చుట్టూ పెళ్లి అంశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దేశంలో వ్యవస్థలు అలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఇదొక వ్యక్తిగతమైన విషయం. కేవలం మహిళల్నే ఈ కోణంలో చూడడం అనవసరం. ఇది అందరికీ వర్తిస్తుంది కదా.”

ఇలా తన అసహనాన్ని వ్యక్తంచేసింది తమన్న. ప్రస్తుతం తనకు సైరా లాంటి మంచి సినిమాలు పడుతున్నాయని, మంచి పాత్రలు వస్తున్నాయని, కెరీర్ ను ఎంజాయ్ చేయనీయండంటూ మీడియాకు సూచించింది. పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని ప్రకటించింది.

అంతా బాగానే ఉంది కానీ, హీరోయిన్ల దగ్గరే పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నారంటూ తమన్న పరోక్షంగా చెప్పడం మాత్రం బాగాలేదు. హీరోల దగ్గర కూడా మీడియా ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది. మొన్నటికిమొన్న సాహో ప్రమోషన్ సందర్భంగా తన పెళ్లిపై ప్రభాస్ ప్రతి ఇంటర్వ్యూలో స్పందించాడు. నితిన్, రానా, నాగశౌర్య లాంటి హీరోలందరికీ ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. హీరోయిన్లను మాత్రమే పెళ్లిపై ప్రశ్నిస్తున్నారని తమన్న వాదించడం కరెక్ట్ కాదేమో..!