అలీ కూడా నోరు పారేసుకున్నాడు

రివ్యూలపై నోరు పారేసుకోవడం సెలబ్రిటీలకు ఫ్యాషన్ అయిపోయింది. డిజాస్టర్ సినిమాకు కూడా నాగార్జున సమీక్షకులపై మండిపడ్డాడు. ఇప్పుడు అలీ వంతు వచ్చింది. రాజుగారి గది 3 సినిమా బాగాలేదన్నందుకు రివ్యూ రాసినవాళ్లపై విరుచుకుపడ్డాడు ఈ సీనియర్ కమెడియన్. రివ్యూ రాసినోళ్లను కోంకిస్కా గొట్టాలన్నాడు.

“కొంతమంది పనిగట్టుకొని సినిమా బాగాలేదన్నారు. ఏదో అనుకున్నాం, ఏదో ఎక్స్ పెక్ట్ చేశాం అన్నారు. మీరు ఎవరు చెప్పడానికి కోంకిస్కా గొట్టం గాళ్లు. చెప్పాల్సింది ప్రేక్షకదేవుళ్లు. వాళ్లు ఎవర్ని ఎక్కడికి తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేస్తారు. వాళ్లను నమ్ముకొని మేం బతుకుతున్నాం. సినిమాపై కామెంట్ చేసేవాళ్లను నమ్ముకొని మేం ఇండస్ట్రీకి రాలేదు.”

ప్రివ్యూ షో చూసే జనాలు అదోలా ఫీల్ అవుతారని….జేబులో డబ్బు ఎవడో లాగేసుకుంటున్నట్టు, నవ్వితే ఎవరైనా ఫీల్ అవుతారేమో అన్నట్టు ముఖాలు పెడతారని.. అందుకే ఇకపై తను ప్రివ్యూ షోలు చూడడం మానేస్తానని ప్రకటించారు అలీ. ఒకవేళ సినిమా చూడాలనుకుంటే డబ్బులు పెట్టి థియేటర్ కు వెళ్లి చూస్తానంటున్నారు. రివ్యూ రాసేవాళ్లను మూర్ఖులు అన్నారు.

“సినిమాపై ఓ రాయి వేసేస్తే మనం తోపులు అనుకుంటున్నారు చాలామంది. కానీ మీ అంత మూర్ఖులు ఎవ్వరూ ఉండరని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో రాజుగారి గది 3 వారికి సమాధానం చెబుతుంది. హీరో అశ్విన్ కు నేను ఒకటే చెబుతాను. విమర్శలు చాలా వస్తుంటాయి, చాలామంది వాటిని ఫేస్ చేశారు. వాళ్లలో నేను ఒకడ్ని అనుకో . అంతకంటే ఎక్కువ ఆలోచించకు.”

ఉన్నట్టుండి ఇలా అలీ ఒక్కసారిగా సమీక్షకులపై విరుచుకుపడడంతో అంతా ఆశ్చర్యపోయారు. అలీకి వెబ్ సైట్స్, సమీక్షలపై ఎందుకింత కోపం వచ్చిందో అర్థంకాక తలగోక్కుంటున్నారు.