ఫాలోఆన్స్ లో కొహ్లీ సరికొత్త రికార్డు

  • అజర్ రికార్డును అధిగమించిన విరాట్ కొహ్లీ
  • సఫారీలను రెండుసార్లు ఫాలోఆన్ చేసిన ఏకైక కెప్టెన్

టెస్ట్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పిన విరాట్ కొహ్లీ… ప్రత్యర్థి జట్లను ఫాలోఆన్ ఆడించడంలోనూ తనపేరుతో మరో సరికొత్త రికార్డును జత చేసుకొన్నాడు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రస్తుత మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా పూణేలో ముగిసిన రెండోటెస్టులో తొలిసారిగా ఫాలోఆన్ ఇచ్చిన కొహ్లీ… రాంచీలో జరుగుతున్న ఆఖరిటెస్టులో సైతం సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం ద్వారా…మహ్మద్ అజరుద్దీన్ పేరుతో ఉన్న 7 ఫాలోఆన్ ల రికార్డును తెరమరుగు చేశాడు.

టెస్ట్ క్రికెట్లో భారత్ కు 51సార్లు నాయకత్వం వహించిన విరాట్ కొహ్లీ…అత్యధికంగా 31 విజయాలు అందించడంతో పాటు… 8సార్లు ప్రత్యర్థిజట్లను ఫాలోఆన్ కు గురి చేయగలిగాడు.

కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ 5సార్లు, సౌరవ్ గంగూలీ నాలుగుసార్లు ప్రత్యర్థిజట్లను ఫాలోఆన్ ట్రాప్ లో బిగించగలిగారు.

స్వదేశీగడ్డపై వరుసగా 11టెస్టు సిరీస్ లు నెగ్గడం ద్వారా విరాట్ కొహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడం మరో విశేషం.