రాంచీ టెస్టులో విజయానికి 2 వికెట్ల దూరంలో భారత్

  • తీన్మార్ సిరీస్ లో క్లీన్ స్వీప్ కు భారత్ రెడీ

టెస్ట్ క్రికెట్ మూడో ర్యాంకర్ సౌతాఫ్రికాతో జరుగుతున్న తీన్మార్ టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ కు భారత్ 2 వికెట్ల దూరంలో నిలిచింది. ఇప్పటికే విశాఖ, పూణే టెస్టుల్లో సఫారీలను చిత్తు చేసిన విరాట్ సేన…రాంచీలోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టు లో సైతం ఇన్నింగ్స్ విజయానికి చేరువయ్యింది.

రెండోఇన్నింగ్స్ లో ఫాలోఆన్ ఆడుతున్న సౌతాఫ్రికా..మూడోరోజుఆట ముగిసే సమయానికే 8 వికెట్ల నష్టానికి 132 పరుగులతో ఎదురీదుతోంది.

భారత ఫాస్ట్ బౌలింగ్ జోడీ ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బౌలింగ్ తో సఫారీలకు పట్టపగలే చుక్కలు చూపించారు. టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది.

ఓపెనర్ ఎల్గర్ తలకు గాయం కావడంతో…అతని స్థానంలో సబ్ స్టిట్యూట్ గా వచ్చిన డి బ్రూయిన్ 30, ఆల్ రౌండర్ నోర్జే 5 పరుగుల స్కోర్లతో పోరాడుతున్నారు.

భారత బౌలర్లలో షమీ 3, ఉమేశ్ 2 వికెట్లు, అశ్విన్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

ఇన్నింగ్స్ ఓటమినుంచి బయటపడాలంటే సౌతాఫ్రికా..నాలుగోరోజు ఆటలో మరో 203 పరుగులు చేయాల్సి ఉంది. అయితే …భారత్ నాలుగోరోజు ఆట మొదటి గంటలోనే మ్యాచ్ ను సొంతం చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుత ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో ఇప్పటి వరకూ ఆడిన నాలుగుకు నాలుగు టెస్టులూ నెగ్గడం ద్వారా 200 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన భారత్ ప్రస్తుత ఆఖరి టెస్ట్ సైతం నెగ్గడం ద్వారా పాయింట్ల సంఖ్యను 240కి పెంచుకోడం ఖాయమని చెప్పాల్సిన పనిలేదు.