రాయల్ వశిష్ట బోటు వెలికితీత

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న రాయల్ వశిష్ట అనే బోటు గోదావరిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. గత 37 రోజులుగా మునిగిపోయిన బోటును తీయడానికి ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర కృషి చేసింది.

కాగా, మునిగిన బోట్లు, లాంచీలను వెలికితీసే విషయంలో అనుభవం ఉన్న ధర్మాడి సత్యం బృందం గత కొన్ని రోజులుగా రాయల్ వశిష్టను బయటకు తీయడానికి ప్రయత్నించారు. వెలికితీత పనుల సమయంలో గోదావరి నీటి మట్టం అనూహ్యంగా పెరగడం, మునిగిన ప్రదేశంలో సుడి గుండాలు ఉండటం, భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి.

అయితే గత వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బోటు వెలికితీత పనులు సత్యం బృందం ముమ్మరం చేశాయి. రెండు రోజుల క్రితం బోటు పైకప్పును తీశారు. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్లు బోటు కచ్చితంగా ఎక్కడ ఉందో కనుగొని ఇవాళ దానిని బటయకు తీయడానికి ప్రయత్నించారు.

బోటు పూర్తిగా ధ్వంసం అయిన పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా నెమ్మదిగా ఇవాళ బయటకు తీశారు.

బోటు ప్రమాదంలో 39 మంది మృతి చెందగా ఇంకా 12 మంది ఆచూకీ లభించలేదు. బోటును పూర్తిగా ఒడ్డుకు చేర్చిన తర్వాత గల్లంతైన వారి ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉంది.