చంద్రబాబుకు పద్ధతి లేదు.. లోకేష్ కు బుద్ది లేదు..

ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత తీరును ఎండగడుతూ విరుచుకుపడ్డాడు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు వ్యక్తిగత దాడి చేస్తున్నారని, 40 ఏళ్ల బాబు రాజకీయ అనుభవాన్ని దిగజార్చుకుంటున్నారని ఆయన అన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాక మానసిక సమతుల్యతను కోల్పోయాడని మోపిదేవి ఆరోపించారు.

ఎన్నికలలో అవమానకరమైన ఓటమి చంద్రబాబు నాయుడులో అభ్రదతా భావాన్ని సృష్టించిందని.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పరంపరను చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని మంత్రి అన్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మోపిదేవి…. ప్రతిరోజూ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై, ప్రభుత్వంపై టిడిపి చీఫ్ చేస్తున్న విమర్శలపై ఇన్నాళ్లు వేచి చూసి ఇప్పుడు తీవ్ర విమర్శలు చేయడం వైసీపీలోనూ చర్చనీయాంశమైంది.

“ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన విమర్శలలో ఎటువంటి విషయం లేదు. ఆయన చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత దాడి చేస్తున్నాడు. తద్వారా తన సొంత ఇమేజ్‌ను తగ్గించుకుంటున్నాడు ”అని మంత్రి మోపిదేవి ఫైర్ అయ్యారు.

“చంద్రబాబు నాయుడు నోరుజారుతూ తనకున్న వ్యక్తిగత ప్రతిష్టను కూడా కోల్పోతున్నాడు. ఇక ఆయన కుమారుడు లోకేష్ బుద్ధిహీనంగా ప్రవర్తించటానికి కారణం చంద్రబాబు వైఖరే కావచ్చు” అని మోపిదేవి అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో కొంత కసరత్తు చేసి మాట్లాడాలని టిడిపి నాయకులకు సలహా ఇచ్చారు.

”చంద్రబాబు విమర్శలు… ఆయన భాష చూస్తే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని.. ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు చేశాడంటే ఎవరూ నమ్మరని మోపిదేవి అన్నారు. అంతటి రాజకీయ అనుభవం మరియు పరిపక్వత ఇప్పుడు ఆయనలో లేదు ” అని వెలగపూడిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి విరుచుకుపడ్డాడు.