Telugu Global
NEWS

30 సంవత్సరాల వయసులో టెస్ట్ క్యాప్

జార్ఖండ్ స్పిన్నర్ కల నిజమాయెగా…! భారత 296వ టెస్ట్ క్రికెటర్ నదీమ్ కొందరి గాయాలు…మరికొందరి పాలిట వరంగా మారుతాయనడానికి నిదర్శనమే జార్ఖండ్ స్పిన్ జాదూ షాబాజ్ నదీమ్. రాంచీలోని జార్కండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి కొద్దిగంటల ముందే అదృష్టం ..ఫోన్ కాల్ రూపంలో వచ్చి నదీమ్ తలుపు తట్టింది. వాస్తవానికి …ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో మూడో స్పిన్నర్ గా ఆడాల్సిన కుల్దీప్ కు గాయం కావడంతో…కోల్ కతాలో నివాసం […]

30 సంవత్సరాల వయసులో టెస్ట్ క్యాప్
X
  • జార్ఖండ్ స్పిన్నర్ కల నిజమాయెగా…!
  • భారత 296వ టెస్ట్ క్రికెటర్ నదీమ్

కొందరి గాయాలు…మరికొందరి పాలిట వరంగా మారుతాయనడానికి నిదర్శనమే జార్ఖండ్ స్పిన్ జాదూ షాబాజ్ నదీమ్. రాంచీలోని జార్కండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి కొద్దిగంటల ముందే అదృష్టం ..ఫోన్ కాల్ రూపంలో వచ్చి నదీమ్ తలుపు తట్టింది.

వాస్తవానికి …ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో మూడో స్పిన్నర్ గా ఆడాల్సిన కుల్దీప్ కు గాయం కావడంతో…కోల్ కతాలో నివాసం ఉంటున్న జార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ కు కబురెళ్లింది.

నమాజ్ సమయంలో ఫోన్ కాల్..

సౌతాఫ్రికాతో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత తుదిజట్టులో తనకు చోటు దక్కినట్లు…షాబాజ్ నదీమ్ కు ఫోన్ కాల్ ద్వారా పిలుపు వచ్చింది. నమాజ్ చేస్తున్న సమయంలో తనకు టెస్ట్ మ్యాచ్ ఆడటానికి రమ్మంటూ పిలుపురావడం.. ఆశ్చర్యాన్ని, పట్టలేని ఆనందాన్ని కలిగించిందని నదీమ్ పొంగిపోతూ చెప్పాడు.

భారతజట్టులో సభ్యుడిగా టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని తాను కలనైనా ఊహించలేదని…అయితే…అనూహ్యంగా పిలుపురావడాన్ని మించిన అదృష్టం మరొకటిలేదని తెలిపాడు.

కోల్ కతా నుంచి రో్డ్డు మార్గంలో…

మ్యాచ్ ఆరంభానికి కొద్ది గంటల ముందే తనకు ఫోను ద్వారా పిలుపు రావడం తో కోల్ కతా నుంచి రాంచీకి రోడ్డుమార్గం ద్వారా హుటాహటిన వచ్చినట్లు.. నదీమ్ చెప్పాడు.

కెప్టెన్ విరాట్ కొహ్లీ చేతుల మీదుగా భారత టెస్ట్ క్యాప్ అందుకోడం గొప్ప అనుభూతిని మిగిల్చిందని అన్నాడు. 2004-05 సీజన్లో రంజీట్రోఫీ అరంగేట్రం చేసిన షాబాజ్ నదీమ్ గత 15 సంవత్సరాలుగా తన ప్రస్థానం కొనసాగిస్తూనే వస్తున్నాడు.

దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడం ద్వారా దేశంలోని నాణ్యమైన లెఫ్టామ్ స్పిన్నర్లలో ఒకనిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

గత 15 ఏళ్ల కాలంలో 110 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన నదీమ్ కు 424 వికెట్లు పడగొట్టిన అసాధారణ రికార్డు ఉంది. ఇందులో 19సార్లు 5 వికెట్ల చొప్పున, 5సార్లు పది వికెట్లు చొప్పున పడగొట్టిన ఘనత సైతం ఉంది.

టెస్టు తొలిఇన్నింగ్స్ లోనే 2 వికెట్లు…

సౌతాఫ్రికా తొలిఇన్నింగ్స్ లో…నదీమ్ 11.2 ఓవర్లలో 4 మేడిన్లతో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సఫారీ మిడిలార్డర్ ఆటగాడు టెంబా బవుమా, యానరిక్ నోర్జే వికెట్లను నదీమ్ పడగొట్టాడు.

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో 296వ టెస్ట్ ప్లేయర్ గా రికార్డుల్లో చేరిన నదీమ్ కు మరోసారి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందా అంటే …అవును అని చెప్పడం కష్టమే మరి.

భారత స్పిన్ త్రయం అశ్విన్ ,రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లలో ఏ ఇద్దరు గాయపడి…అందుబాటులో లేని పక్షంలోనే నదీమ్ కు మరోసారి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.

ఏదిఏమైతేనేం…ఈ మధ్యకాలంలో అనూహ్యంగా…అదీ మూడుపదుల వయసులో టెస్ట్ క్యాప్ అందుకొన్న క్రికెటర్ ఎవరంటే …షాబాజ్ నదీమ్ మాత్రమే అని చెప్పాలి.

First Published:  21 Oct 2019 7:54 PM GMT
Next Story