ఆళ్లగడ్డలో నా భర్త యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు… ఆయన కులం వల్ల నేను ఓడిపోలేదు…

రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే తన భర్తపై పోలీసులు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఇటీవల క్రషర్‌ వ్యాపారిపై అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్ నాయుడు దాడి చేసి అతడి నుంచి క్రషర్‌ ఫ్యాక్టరీని బలవంతంగా రాయించుకునేందుకు ప్రయత్నించిన కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు.

అరెస్ట్‌కు పోలీసులు ప్రయత్నిస్తుంటే తప్పించుకుని తిరిగాడు. ఈ కేసులో భార్గవ్‌ రామ్‌తో పాటు నిందితులుగా ఉన్న వారు హైదరాబాద్‌ యూసఫ్‌గూడలో ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే సెర్చ్ వారెంట్‌ లేకుండా ఇంట్లోకి ఎలా వస్తారంటూ వారు అడ్డుకున్నారు. అతి కష్టం మీద పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన అఖిలప్రియ… జిల్లా ఎస్పీ ఫకీరప్ప తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఆరోపించారు. తన భర్తకు ఏమైనా జరిగితే అందుకు ఫకీరప్పే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.

మొన్నటి ఎన్నికల్లో తన భర్త భార్గవ్‌ రామ్ కులం వల్లే తాను ఓడిపోయానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన భర్త కులాన్ని తెరపైకి తేవడం సరైనది కాదన్నారు. తన భర్త భార్గవ్‌ రామ్ ఆళ్లగడ్డ బాధ్యతలు తీసుకుని చురుకైన వ్యక్తిగా యాక్టివ్‌గా పనిచేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేకే కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.

ఎప్పటి నుంచో రాజకీయంగా అండగా ఉన్న కులాలు తన భర్త భార్గవ్‌ రామ్ వల్ల దూరం అయ్యాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. భూమా నాగిరెడ్డి ఆశయాల కోసమే తన భర్త భార్గవ్‌రామ్ చురుకైన కార్యకర్తగా ఆళ్లగడ్డలో బాధ్యతలు తీసుకున్నారని పరోక్షంగా ఆళ్లగడ్డ రాజకీయాల్లో భార్గవ్‌ రామ్ నాయుడు పాత్ర నిజమేనని ఆమె అంగీకరించారు.