గుంటూరు, బెజవాడలో 10 అడుగుల పునాది చాలు.. అమరావతిలో 100 అడుగులు తవ్వాలి- ఇదీ బాబు ఎంపిక

చంద్రబాబులో ఎందుకు అసహనం, ఆక్రోశం పెరుగుతోందో అర్థం కావడం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఐదేళ్లలో చంద్రబాబు అమరావతిలో ఒక్క కట్టడమైనా శాశ్వతంగా కట్టారా అని ప్రశ్నించారు. ఆ తాత్కాలిక కట్టడాలకు కూడా రాష్ట్రంలో చదరపు అడుగుకు మూడు వేలు అవుతుంటే అమరావతిలో 10వేలు చెల్లించి కట్టారన్నారు.

అమరావతిపై చంద్రబాబుకు అంత నమ్మకం, ధీమా ఉంటే ఐదేళ్లలో ఒక్క శాశ్వత కట్టడం కూడా ఎందుకు కట్టలేదని నిలదీశారు. ఐదేళ్లలో లక్షా 65వేల కోట్ల అప్పు చేసి కూడా ఒక్క శాశ్వత నిర్మాణం ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.

చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి జరిగిన నష్టం పూడ్చలేనిది అని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని అన్నది ఒక సామాజిక వర్గానికి చెందినది కాకూడదన్నారు. చంద్రబాబు నిజంగా అమరావతి నిర్మించి ఉంటే…. ఎత్తుకెళ్లడానికి అదేమైనా గ్రాఫిక్స్ బొమ్మలా అని ప్రశ్నించారు. ఆదాయం పెంచానని చంద్రబాబు చెప్పుకోవడం విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు ఎవరి ఆదాయం పెంచారో అందరికీ తెలుసన్నారు. బాలకృష్ణ వియ్యంకుడికి రాజధాని వద్ద 500 ఎకరాలు కేటాయించింది నిజం కాదా అని నిలదీశారు.

రాజధాని భూములను చంద్రబాబు, ఆయన బినామీలు, బంధువులు, ఆయన సామాజికవర్గం వారు దోచుకున్నది నిజం కాదా అని బొత్స ప్రశ్నించారు. లక్షా 65వేల కోట్ల అప్పు తెచ్చిన చంద్రబాబు అమరావతిలో ఖర్చు పెట్టింది కేవలం 5వేల కోట్లు మాత్రమేనన్నారు. రాజధానిపై చంద్రబాబు, టీడీపీ నేతలకు ఇంకా ఏం క్లారిటీ కావాలని ప్రశ్నించారు.

చంద్రబాబు , ఆయన బంధువులు, టీడీపీ నేతలు, చంద్రబాబు సామాజికవర్గంలోని కొందరు వ్యక్తులు దోచుకున్న భూములు ఉంటాయా? పోతాయా? అన్న దానిపై క్లారిటీ కావాలా అని ప్రశ్నించారు.

నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి శంకుస్థాపన చేసిన హైటెక్ సిటీని తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటారని… అదే శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్‌, రింగ్‌ రోడ్డులను వైఎస్‌ఆర్‌ నిర్మిస్తే…. తిరిగి వాటిని కూడా తానే మొదలుపెట్టా అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రాజధాని ఏ ఒక్క సామాజికవర్గానికో చెందినదిగా ఉండకూడదన్నారు. 13 జిల్లాల ప్రజలు తమ సొంతం అనుకునేలా రాజధాని ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. నిపుణులు కమిటీలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించి ఇచ్చే నివేదికల ఆధారంగానే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.

భవనం నిర్మించాలంటే విజయవాడలో 8 అడుగులు, గుంటూరులో 10 అడుగులు పునాది తవ్వాల్సి ఉంటుందని… కానీ చంద్రబాబు రాజధానికి ఎంపిక చేసిన భూమిలో భవనం కట్టాలంటే 100 అడుగులు పునాది తవ్వాల్సి ఉంటుందన్నారు.

ఇప్పటికే నిర్మించిన తాత్కాలిక భవనాలకు కూడా 100 అడుగుల పునాదులు తీసింది నిజం కాదా అని ప్రశ్నించారు. 100 అడుగులు పునాదులు తీయాలంటే ఎన్ని వేల కోట్లు వృథా అవుతుందో చంద్రబాబుకు తెలియదా అని నిలదీశారు.

రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని దళితుల నుంచి అసైన్డ్ భూములను తక్కువ ధరకు టీడీపీ నేతలు లాక్కుని మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని పట్టుకుని చంద్రబాబు వాడువీడు అంటూ ఇటీవల ప్రసంగాల్లో మాట్లాడుతున్నారని… ఇదేనా చంద్రబాబు సంస్కారం అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు ఇంతగా దిగజారిపోయారని మండిపడ్డారు.