టీడీపీని మూసివేసే ప్రసక్తే లేదని పదేపదే చంద్రబాబు ఎందుకంటున్నారు?

కొత్త ప్రభుత్వం విఫలమైందంటూ మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు. దారుణమైన ఆర్థిక స్థితి వారసత్వంగా వచ్చినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు… పించన్ 2,250 ఇవ్వడం నిజం కాదా… రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది నిజం కాదా, మొట్టమొదటిసారి రైతుల బీమా సొమ్మును కూడా ప్రభుత్వమే కడుతున్నది నిజం కాదా?, మద్యం షాపులను 20 శాతం తగ్గించి.. బెల్ట్‌ షాపులు లేకుండా చేసింది నిజం కాదా… మరికొన్ని నెలల్లో మహిళలకు అమ్మ ఒడి సొమ్ము ఇవ్వబోతున్నామని ఇది నిజం కాదా అని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు నడిపిన ఇసుక మాఫియాకు ప్రభుత్వం చెక్‌ పెట్టడంతో చంద్రబాబు అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో వానలు లేవు కాబట్టి ఎప్పుడైనా ఇసుక తవ్వుకునే వారని… ఇప్పుడు వరదల వల్ల ఇసుక దొరకడానికి ఇబ్బంది ఏర్పడిందన్నారు. కొద్ది రోజులు ఆగితే ఇసుక సమస్య ఉండదన్నారు.

వైసీపీ పాలనతో ఏపీ 10వ స్థానానికి దిగజారిందంటూ యనమల చేసిన వ్యాఖ్యలపైనా బుగ్గన స్పందించారు. చంద్రబాబు హయాంలో జరిగిన పరిణామాలకు నీతి ఆయోగ్ ర్యాంకులు ఇస్తే… యనమల మాత్రం మూడు నెలల వైసీపీ పాలనపై ర్యాంకులు ఇచ్చారంటూ…. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కనీసం ఐదేళ్లు, పదేళ్ల పాటు చేసిన ప్రయత్నాల ఆధారంగా ర్యాంకులు ఇస్తే దాన్ని మూడు నెలల వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టడం ఏమిటని నిలదీశారు.

నీతి ఆయోగ్ రిపోర్టును పరిశీలిస్తే ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న విషయం అర్థమవుతుందన్నారు. చంద్రబాబు పదేపదే టీడీపీకి ఏమీ కాదు… మూసివేసే అవకాశమే లేదు అని ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. రాత్రి 8 గంటలకే మద్యం షాపులు బంద్‌ అవుతుంటే మహిళలంతా ఆనందంగా ఉన్నారని… చంద్రబాబు మాత్రం బాధపడిపోతున్నారన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే అంతకు ముందున్న ప్రభుత్వాలు నిర్మించిన విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి రావడంతో… ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు తగ్గిపోయాయన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో కూడా విద్యుత్ సరఫరా పెరిగిందన్నారు.

కానీ చంద్రబాబు ఏపీలో మాత్రమే తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే విద్యుత్‌ వ్యవస్థను మొత్తం దారిన పెట్టినట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మిగిలిన రాష్ట్రాలు ఎక్కువగా థర్మల్ విద్యుత్‌కు ప్రాధాన్యత ఇస్తే చంద్రబాబు మాత్రం ఎక్కువగా సౌర, పవన విద్యుత్‌కు ఒప్పందాలు చేసుకోవడం వల్ల రాష్ట్రంపై భారీగా ఆర్ధిక భారం పడిందన్నారు.

తాము తేవాల్సిన దాని కంటే ఎక్కువ అప్పులు తెచ్చామని.. కాబట్టి కొత్తగా వచ్చే ప్రభుత్వానికి అప్పులు దొరకవు, డబ్బులు ఉండవు అంటూ ఇదే యనమల రామకృష్ణుడు ఎన్నికల ముందు చెప్పి వెళ్లారని బుగ్గన గుర్తు చేశారు. పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ చిత్తశుద్దితో అధిగమిస్తామన్నారు.