ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని మోసం – టీడీపీ మ‌హిళా నేతపై ఫిర్యాదు

టీడీపీ మహిళా నాయకురాలు మామిళ్లపల్లి దీప్తి మోసాలు గుంటూరులో హాట్ టాపిక్‌గా మారాయి. బోడుపాలెంకు చెందిన దీప్తి టీడీపీ పెద్ద‌ల‌తో ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని, ఉద్యోగాలు ఇప్పిస్తాన‌ని, కాంట్రాక్టు బిల్లులు ఇప్పిస్తాన‌ని చెప్పి ప‌లువురిని మోసం చేసిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. ఈమేర‌కు బాధితులు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుంటూరుకు చెందిన మాజీ మంత్రి అండ‌తో ఈ కిలాడీ లేడి రెచ్చిపోయిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి పీఏ అని ఒక‌సారి, సీపీఎల్ ఏ పీఏ పేరుతో న‌కిలీ ఐడీ కార్డులు సృష్టించి అమాయ‌కుల‌ను బురిడీ కొట్టించింది.

సెక్రెటేరియ‌ట్ కు తీసుకెళ్లి మంత్రుల చాంబ‌ర్‌లో హ‌ల్‌చ‌ల్ చేసేది. ఇది న‌మ్మి ప‌ని అవుద్దనే ఉద్దేశంతో బాధితులు ఆమెకు డ‌బ్బు ఇచ్చేవారు. క‌డ‌ప జిల్లాకు చెందిన వ‌ల్ల‌భ‌రెడ్డి, రామ‌కృష్ణారెడ్డితో పాటు గుంటూరుకు చెందిన కొంద‌రు ఈమె చేతిలో మోస‌పోయారు. ఈనెల 15న వీరంతా పెద‌కాకాని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

గుంటూరు కృష్ణానగర్‌కు చెందిన మన్నవ వంశీకృష్ణకు…. వినుకొండ, నరసరావుపేట మున్సిపాలిటీల పరిధిలో చేసిన కాంట్రాక్ట్‌ పనులకు సంబంధించి బిల్లులు రాలేదు. వీరు సచివాల‌యం చుట్టూ తిరుగుతుండ‌గా దీప్తి వీరికి కలిసింది. తాను బిల్లులు ఇప్పిస్తాన‌ని చెప్పి ల‌క్ష రూపాయ‌లు తీసుకుంది. అటు బిల్లులు రాలేదు. ఇటు డ‌బ్బులు తీసుకున్న త‌ర్వాత మొహం చాటేసింది. దీంతో ఇప్పుడు బాధితులు గుంటూరు అర్బ‌న్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

దీప్తి మోసాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి రావ‌డంతో పోలీసులు ఆమె కోసం వెత‌క‌డం మొదలెట్టారు. ఈ విష‌యం తెలిసిన ఆమె పరారైన‌ట్లు తెలుస్తోంది.

2017లో అప్పటికే దీప్తికి ఒక మాజీ మంత్రితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దానిని అడ్డుగా పెట్టుకొని గుంటూరు కార్పొరేషన్‌లో ఆనంద‌ల‌హ‌రి కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌ను ప‌ట్టేసింది. ప్రతి వారం హ్యాపీ సండే పేరిట కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తూ 60 వేల రూపాయ‌లు వసూలు చేసింది. ఈ కార్య‌క్ర‌మం బిల్లుల కోసం అధికారుల‌పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి పాస్ చేయించుకునేది.

త‌న సామాజిక‌వర్గంకు చెందిన అధికారులు, మంత్రుల దగ్గ‌ర‌కు రెగ్యుల‌ర్‌గా వెళ్లి త‌న‌కు ప‌ర‌ప‌తి ఉంద‌ని బిల్డ‌ప్ ఇచ్చేది. టీడీపీ నేత‌ల‌తో ఫోటోలు దిగి..వాటిని చూపించి అమాయ‌కుల‌ను న‌మ్మించేది. మొత్తానికి ఈ కిలాడీ లేడీ మోసాల‌పై పోలీసుల‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇంకా మ‌రింత మంది బాధితులు పెరిగే అవ‌కాశం ఉంది.