రేవంత్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ల‌కు కోప‌మెందుకు?

కాంగ్రెస్‌లో ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి…. ర‌చ్చ క్రియేట్ చేస్తోంది. త‌మ‌కు స‌మాచారం ఇవ్వ‌కుండానే ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డికి పిలుపు ఇవ్వ‌డంపై సీనియ‌ర్ నేత‌లు కోపంగా ఉన్నారు. సీఎల్పీ కార్యాల‌యంలో భ‌ట్టి విక్ర‌మార్క‌, సంప‌త్‌ కుమార్‌, హ‌నుమంత‌రావు, మ‌ధుయాష్కీ, కోదండ‌రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు స‌మావేశ‌మ‌య్యారు. కాంగ్రెస్‌లో తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చించారు.

రేవంత ఎవరిని సంప్ర‌దించి ముట్ట‌డి ప్ర‌క‌టించార‌ని ఈ నేత‌లంతా ప్రశ్నిస్తున్నారు. కనీసం పీసీసీ చీఫ్ అయినా తమకు సమాచారం ఇవ్వలేదని, మీడియాకు నోట్ రీలీజ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విష‌యంపై హైక‌మాండ్‌కు ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇటు ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డిపై ష‌బ్బీర్ అలీ ఇంట్లో స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి హాజ‌ర‌య్యారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చించారు.

హుజూర్‌న‌గ‌ర్ పోలింగ్ ఉండ‌డంతో న‌ల్గొండ నేత‌లు ముట్ట‌డి కార్య‌క్రమానికి హాజ‌రుకాలేదు. అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌, స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు ప‌లువురు హైద‌రాబాద్ నేత‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రాత్రికి రాత్రికి కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డంతోనే సీనియ‌ర్స్ తాము పాల్గొన‌లేద‌ని ప్ర‌శ్నిస్తార‌ని…త‌మ‌కు స‌మాచారం లేద‌ని కొత్త ప‌ల్ల‌వి అందుకున్నార‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో మ‌ళ్లీ వ‌ర్గ విభేదాలు తెర‌పైకి వ‌చ్చాయి. రేవంత్‌కు వ్య‌తిరేకంగా వీరంతా గ‌ళం విప్పారు. ఈ నేత‌లు అటు హుజూర్‌న‌గ‌ర్ వైపు వెళ్లారు. కానీ ఏదో ఒక రోజు మాత్ర‌మే ప్ర‌చారం చేశారు. కానీ రేవంత్ ఈ సారి రెండు రోజులు హుజూర్‌న‌గ‌ర్‌లో రోడ్ షోలు నిర్వ‌హించారు. ఆయ‌న షోల‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ఇటు ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి కూడా హ‌ల్‌చ‌ల్ క్రియేట్ చేసింది. దీంతో రేవంత్ ఇమేజ్‌కు డ్యామేజీ ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నంలోనే సీనియ‌ర్ నేత‌లు ఈ లీకులు ఇవ్వ‌డం మొద‌లెట్టార‌నేది రేవంత్ వ‌ర్గం ఆరోప‌ణ‌. అయితే కాంగ్రెస్‌లో ఇదంతా కామ‌న్ అని కొంద‌రు కొట్టిపారేస్తున్నారు.