సర్వేలన్నీ కారు వైపే…. కానీ రోడ్డు రోలర్‌ భయపెడుతోందట….

బై పోల్‌ ముగిసింది. గులాబీకి కొత్త టెన్షన్‌ పట్టుకుంది. ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌ చేరాయి. కానీ ఎక్కడో ఒక డౌట్‌. రోడ్డు రోలర్‌ ఏం చేయబోతోంది అని ఆందోళన చెందుతున్నారు.

హుజూర్‌నగర్‌లో మొత్తం 2లక్షల 754 ఓట్లు పోలయ్యాయి. 84.76 శాతం పోలింగ్‌ నమోదైంది. వీరిలో మహిళలు 1,01,698. పురుషులు 99,056. గత ఎన్నికల కంటే ఐదు శాతం ఎక్కువగా ఓట్లు పడ్డాయి. దీంతో పెరిగిన ఓట్ల శాతం ఎవరికి అనుకూలం అనే లెక్కలు మొదలయ్యాయి.

ఇప్పటివరకూ వెలువడ్డ సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌దే గెలుపు అని చెబుతున్నాయి. ఇటు గ్రౌండ్‌ లెవల్‌ నుంచి అందుతున్న సమాచారం కారు వైపు ఉంది. పదివేలకు పైగా మెజార్టీతోనే గెలుస్తామని గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. 20 వేలు దాటుతుందని మరికొందరు లెక్కలు వేస్తున్నారు. కానీ రోడ్డు రోలర్‌ గుర్తు ఏం చేస్తుందో అనే దడ మాత్రం టీఆర్‌ఎస్‌ నేతల్లో కనపడుతోంది.

ఇప్పుడు హుజూర్‌నగర్‌లో ఈవీఎంలలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు మొదట ఐదు ప్లేస్‌లు కేటాయించారు. ఐదో ప్లేస్‌లో కారు గుర్తు ఉంది. దాని వెంటనే రైతు నడిపే ట్రాక్టర్‌ గుర్తు…ఆ తర్వాత రోడ్డు రోలర్‌ గుర్తులు ఉన్నాయి. మూడు గుర్తులు చూసేందుకు ఒకేలా ఉన్నాయి. దీంతో ఇప్పుడు వృద్ధులు, మహిళలు, కొంత దృష్టి లోపం ఉన్న వారు కారు అనుకుని పొరపాటున రోడ్డురోలర్‌కు వేశారని పోల్‌ పోస్టుమార్టంలో తేలింది.

కారు అనుకుని పొరపాటున రోడ్డురోలర్‌కు వేశారని తేలడంతో గులాబీ నేతలకు టెన్షన్‌ పట్టుకుంది. రోడ్డు రోలర్‌ ఎంత మేరకు డ్యామేజీ చేసిందనే లెక్కలు సేకరించే పనిలో పడ్డారు. కనీసం ఐదు వేల ఓట్లు రోడ్డు రోలర్‌కు పడే అవకాశాలు ఉన్నాయనేది ప్రాథమిక అంచనా. మరికొందరు నేతలు మాత్రం కేవలం వెయ్యి నుంచి 1500 ఓట్లు పడ్డాయని లెక్కలు వేస్తున్నారు.

రిపబ్లిక్ సేన పార్టీకి చెందిన కిరణ్ వంగపల్లి కి రోడ్ రోలర్ గుర్తు వచ్చింది. ఈయనకు ఎన్ని ఓట్లు పడతాయని అటు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు పొలిటికల్‌ లెక్కలు వేస్తున్నారు. మరోవైపు రైతు బిడ్డ పార్టీ అజ్మీరా మహేష్ కు ట్రాక్టర్ నడిపే రైతు, ఇండిపెండెంట్ క్యాండిడేట్‌ లింగిడి వెంకటేష్ కు హెలికాప్టర్ గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయనేది కూడా ఆసక్తికరంగా మారింది.

2014 ఎన్నికల్లో ట్రక్కు గుర్తు గులాబీ సీట్లను తగ్గించింది. 30 నుంచి 35 సీట్లలో ప్రభావం చూపింది. తక్కువ మార్జిన్‌తో గెలవాల్సిన సీట్లను ట్రక్కు ఎఫెక్ట్‌తో కోల్పోయింది.

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో రోడ్డు రోలర్‌ సింబల్‌ ఎఫెక్ట్‌ చాలానే పడింది. భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల్లో రోడ్‌ రోలర్‌ దెబ్బకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ ఓడిపోయారు. ఇక్కడ రోడ్‌ రోలర్‌కు 27వేల 973 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్ల తేడాతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు హుజూర్‌నగర్‌లో కూడా రోడ్డు రోలర్‌ టెన్షన్‌ పెడుతోంది. ఒక్కరోజు ఆగితే ఈ సింబల్‌ ఎఫెక్ట్‌ ఎంత ఉంటుందో తేలిపోనుంది.