టాలీవుడ్ లో దీపావళి హంగామా

ఈ దీపావళికి మునుపటి కంటే కాస్త ఎక్కువ సందడి కనిపించబోతోంది టాలీవుడ్ లో. దాదాపు బడా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ దీపావళి కానుకగా రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని కొత్త సినిమాల్ని కూడా ఈ సందర్భంగా ప్రకటించబోతున్నారు. ఈ దీపావళికి అల వైకుంఠపురములో సినిమా నుంచి సెకెండ్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. బన్నీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ సామజవరగమన ఇప్పటికే పెద్ద హిట్.

దీపావళికి మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి కూడా హంగామా ఉంది. ఈ సినిమా నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అది చాలదు అనుకుంటే, దీపావళి టీజర్ ను విడుదల చేసే ప్లాన్ కూడా ఉంది. ఈ విషయాన్ని అధికారికంగా రేపోమాపో ప్రకటిస్తారు.

మరోవైపు బాలయ్య కూడా దీపావళికి తన కొత్త సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు. నిజానికి దీపావళికి ఏకంగా సినిమా టైటిల్ రిలీజ్ చేయాలనేది దర్శకుడు కేఎస్ రవికుమార్ ఆలోచన. కానీ బాలయ్య మాత్రం ముహూర్తాలు చూస్తున్నారు. అటు మారుతి దర్శకత్వంలో అల్లు శిరీష్ చేయాల్సిన సినిమాను కూడా దీపావళికే ప్రకటిస్తారనే టాక్ నడుస్తోంది.