Telugu Global
NEWS

ఇసుక కొరతను అధిగమించేందుకు కొత్త నిర్ణయం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 80వేల నుంచి 85వేల టన్నుల ఇసుక అవసరం. కానీ నదులన్నీ భారీ వరదతో ప్రవహిస్తుండడంతో ఇసుక వెలికితీతకు అవకాశం లేకుండాపోయింది. కేవలం రోజుకు 45వేల టన్నుల ఇసుక మాత్రమే  సరఫరా అవుతోంది. వరదలు, భారీ వర్షాలు ఇంకా వీడడం లేదు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. నదుల్లో వరద ప్రవాహం తగ్గి ఇసుక అందుబాటులోకి వచ్చే వరకు వాగులు, వంకలు, ఏరులలో లభ్యమయ్యే ఇసుకను సద్వినియోగం […]

ఇసుక కొరతను అధిగమించేందుకు కొత్త నిర్ణయం
X

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 80వేల నుంచి 85వేల టన్నుల ఇసుక అవసరం. కానీ నదులన్నీ భారీ వరదతో ప్రవహిస్తుండడంతో ఇసుక వెలికితీతకు అవకాశం లేకుండాపోయింది. కేవలం రోజుకు 45వేల టన్నుల ఇసుక మాత్రమే సరఫరా అవుతోంది. వరదలు, భారీ వర్షాలు ఇంకా వీడడం లేదు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది.

నదుల్లో వరద ప్రవాహం తగ్గి ఇసుక అందుబాటులోకి వచ్చే వరకు వాగులు, వంకలు, ఏరులలో లభ్యమయ్యే ఇసుకను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాగులు, వంకల్లోని ఇసుకను స్థానిక అవసరాలకు విరివిగా వాడుకునేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాగులు, వంకలు, ఏరుల నుంచి ఇసుక తరలింపుకు పర్మిట్లను గ్రామ సచివాలయాల్లోనే ఇస్తారు.

మూడు నెలల పాటు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. ఆ తర్వాత నదుల్లో ఇసుక లభ్యత పెరిగితే ఈ ఆదేశాలను సవరిస్తారు. ఇసుక కావాల్సిన వారు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యేలా గ్రామ సచివాలయంలో సిబ్బందికి డబ్బులు చెల్లించి రవాణా పర్మిట్‌ తీసుకోవాలి. సచివాలయ అధికారి ఒరిజినల్‌ పర్మిట్‌ను ఇసుక బుక్‌ చేసుకున్న వారికి ఇచ్చి మరో కాపీని సచివాలయంలోనే ఉంచుతారు. ఈ పర్మిట్ 48 గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నిర్దిష్ట సమయంలోగా ఇసుక తీసుకెళ్లకుంటే పర్మిట్‌ చెల్లుబాటు కాదు. ట్రాక్టర్లలో ఇసుకను రేవు నుంచి 20 కిలోమీటర్లకు మించి తీసుకెళ్లరాదు. ఎవరూ అవసరానికి మించి ఇసుక నిల్వ చేయడానికి వీల్లేదు.

ఇసుక రవాణా పర్మిట్‌ పాస్‌ల జారీ కోసం ముద్రిగించిన ఫారం- ఎస్‌3 పుస్తకాలను గ్రామ సచివాలయాలకు ఏపీఎండీసీ సరఫరా చేయనుంది. ఇసుకను తరలించే సమయంలో పర్మిట్ పాస్ తప్పనిసరి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 80 నుంచి 85వేల టన్నుల ఇసుక అవసరం ఉంది. వర్షాలు తగ్గి నిర్మాణాలు పుంజుకుంటే డిమాండ్ లక్షటన్నుల వరకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

నదుల్లో వరద తగ్గితే రోజుకు లక్ష టన్నుల ఇసుక సరఫరాకు ఏపీఎండీసీ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇసుక కొరత తీరాలంటే వర్షాలు ఆగి నదుల్లో ప్రవాహం తగ్గితే చాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  23 Oct 2019 8:05 PM GMT
Next Story