పవన్‌ కల్యాణ్‌ గెటప్‌పై ఆర్‌జీవీ దారుణమైన పోస్టర్

కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో సినిమా తీస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈనెల 27న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన వర్మ.. వరుసగా చిత్రానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తున్నారు.

జగన్‌, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేఏ పాల్, నారా లోకేష్‌లను దాదాపు పోలిక ఉన్నట్టుగా పాత్రలను తీర్చిదిద్దాడు. పోస్టర్లలో నారా లోకేష్, కేఏ పాల్ బొమ్మలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు వర్మ. ఇది మాత్రం పవన్‌ కల్యాణ్ టార్గెట్‌గానే ఉంది. చూసిన వారు ఎవరైనా అది పవన్ కల్యాణ్ క్యారెక్టరే అని గుర్తుపట్టేలా గెటప్ ఉంది. అచ్చం పవన్‌ కల్యాణ్ హెయిర్‌ స్టైల్, అదే జనసేన సింబల్, అదే ఎర్ర తుండుతో పవన్‌ కల్యాణ్ పోస్టర్‌ను ఆర్‌జీవీ విడుదల చేశారు.

ఇంత వరకు బాగానే ఉన్నా పవన్‌ కల్యాణ్ క్యారెక్టర్ వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో ఆయన చుట్టూ ఐదుగురు ఐటం గర్ల్స్‌ను ఆర్‌జీవీ ఉంచాడు. ఐటం గర్ల్స్‌ను చాలా రొమాంటిక్‌గా చూపించాడు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పొలిటిక్ ప్రసంగంతో పవన్‌ ఊగిపోతున్నట్టుగా పోజ్ ఉంటే ఆయన చుట్టూ ఐటం గర్ల్స్‌ను పెట్టడం ద్వారా సినిమాలో పవన్‌ కల్యాణ్ గురించి ఆర్‌జీవీ ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో అని చర్చ జరుగుతోంది.

పోస్టర్ చూసి అది పలాన వారి పోలిక అని ఎవరైనా అనుకుంటే అది కేవలం యాదృచ్చికమే అంటూ ఆర్జీవీ చేతులు దులుపుకున్నారు.