నవంబర్‌లో పోలవరానికి రూ. 3వేల కోట్లు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బును రీయింబర్స్‌ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మూడు వేల కోట్లు విడుదలకు కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనలను పంపగా కేంద్ర ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. నవంబర్‌ మొదటి వారంలోఈ మూడు వేల కోట్లను విడుదల చేస్తామని ఆర్ధిక శాఖ వెల్లడించంది.

పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు 16వేల 935 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందులో 5వేల 135 కోట్లు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందే ఖర్చు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 11వేల 799 కోట్లు ఖర్చు చేయగా… ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 6వేల 727 కోట్లు మాత్రమే రీయింబర్స్‌ చేసింది. ఇంకా 5వేల 72 కోట్లు ఇవ్వాల్సి ఉంది.

చంద్రబాబు హయాంలో కేంద్రానికి సరిగా నివేదికలు పంపకపోవడంతో ఈ నిధుల విడుదల ఆగిపోయింది. జగన్ సీఎం అయిన తర్వాత పోలవరం నిధులు కేంద్రం నుంచి ఎందుకు ఆగిపోయాయి అన్న దానిపై ఆరా తీశారు. ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌లు పంపకపోవడం వల్లే నిధులు ఆగిపోయాయని అధికారులు వివరించారు. దాంతో వెంటనే ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్లను పంపించాలని జగన్ ఆదేశించారు. అదే సమయంలో ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోడీని కలిసి పోలవరం నిధులు విడుదల చేయాలని కోరారు.

అనంతరం పెండింగ్‌లో ఉన్న 5వేల 72 కోట్లను విడుదల చేయాలంటూ ఇటీవల కేంద్ర జలశాఖకు ఏపీ జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ మొదటి వారంలో రూ. 3వేల కోట్లు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.