Telugu Global
National

బీజేపీపై పులి స్వారీ... సేన కొత్త మెలిక

మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోవడం, శివసేన మద్దతు తప్పనిసరి కావడంతో చిక్కొచ్చి పడింది. ఇదే అదనుగా ముఖ్యమంత్రి పీఠం కలను నిజం చేసుకునేందుకు శివసేన వ్యూహానికి పదును పెడుతోంది. ముఖ్యమంత్రి పదవి తమకే ఇవ్వాలని శివసేన డిమాండ్ పెడుతోంది. పార్టీ ఎమ్మెల్యేలతో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి […]

బీజేపీపై పులి స్వారీ... సేన కొత్త మెలిక
X

మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోవడం, శివసేన మద్దతు తప్పనిసరి కావడంతో చిక్కొచ్చి పడింది. ఇదే అదనుగా ముఖ్యమంత్రి పీఠం కలను నిజం చేసుకునేందుకు శివసేన వ్యూహానికి పదును పెడుతోంది.

ముఖ్యమంత్రి పదవి తమకే ఇవ్వాలని శివసేన డిమాండ్ పెడుతోంది. పార్టీ ఎమ్మెల్యేలతో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవితో పాటు మంత్రి పదవులు సమానంగా కేటాయించాలన్నది తమ డిమాండ్ అని శివసేన ఎమ్మెల్యేలు సమావేశం తర్వాత మీడియాకు వెల్లడించారు.

ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉద్దవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రేకు రెండున్నరేళ్లపాటు సీఎం పదవి ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని శివసేనకు ఇస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అమిత్‌ షా కట్టుబడాలని శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఒకవేళ బీజేపీ అందుకు అంగీకరించకపోతే తమకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని ఆ పార్టీ ప్రకటించింది.

బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి పదవి తమ పార్టీకే దక్కుతుందని వాదిస్తోంది. ఊహించిన దానికంటే సీట్లు తగ్గినా 105 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించిందని… 56 సీట్లు సాధించిన శివసేన ముఖ్యమంత్రి పదవి కోరడం సరికాదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

బీజేపీ నుంచి శివసేన దూరంగా జరిగితే ఆ పార్టీకి ఎన్‌సీపీ మద్దతు ఇస్తుందన్న ప్రచారంపై శరద్ పవార్ స్పందించారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందిగా తమకు అవకాశం ఇచ్చారని…. కాబట్టి ప్రజా తీర్పుకు కట్టబడి ఉంటామని పవార్ చెప్పారు.

కాంగ్రెస్ మాత్రం శివసేన పట్ల సానుకూలంగా స్పందిస్తోంది. ప్రజా తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉందని… ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడాలంటే తొలుత శివసేననే చొరవ చూపాల్సి ఉంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అభిప్రాయపడింది.

First Published:  26 Oct 2019 8:52 PM GMT
Next Story