Telugu Global
NEWS

వండర్ విరాట్... థండర్ రోహిత్

టెస్ట్ క్రికెట్లో భారత్ పంచకళ్యాణి అశ్వంలా దూసుకుపోతోంది. వండర్ కెప్టెన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలో ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లోనూ సూపర్ హిట్ కావడంతో ప్రపంచ రికార్డుల మోత మోగిస్తోంది. వండర్ కెప్టెన్ విరాట్ కొహ్లీ…. భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ వన్డే క్రికెట్లో మాత్రమే కాదు…సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం పరుగుల హోరు, సెంచరీల జోరు, రికార్డుల సునామీతో చెలరేగిపోతున్నాడు. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో […]

వండర్ విరాట్... థండర్ రోహిత్
X

టెస్ట్ క్రికెట్లో భారత్ పంచకళ్యాణి అశ్వంలా దూసుకుపోతోంది. వండర్ కెప్టెన్ విరాట్ కొహ్లీ నాయకత్వంలో ఆకాశమే హద్దుగా సాగిపోతోంది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లోనూ సూపర్ హిట్ కావడంతో ప్రపంచ రికార్డుల మోత మోగిస్తోంది.

వండర్ కెప్టెన్ విరాట్ కొహ్లీ….

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ వన్డే క్రికెట్లో మాత్రమే కాదు…సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం పరుగుల హోరు, సెంచరీల జోరు, రికార్డుల సునామీతో చెలరేగిపోతున్నాడు.

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో ముగిసిన మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో టాపార్డర్ బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా జట్టుని ముందుండి నడిపించడమే కాదు…క్లీన్ స్వీప్ విజయంతో తనజట్టును అగ్రస్థానంలో నిలిపాడు.

సౌతాఫ్రికాతో సిరీస్ వరకూ కొహ్లీ కెప్టెన్ గా భారత్ ఆడిన 51 టెస్టు మ్యాచ్ ల్లో 31 విజయాలు సాధించింది. భారత టెస్ట్ చరిత్రలోనే కొహ్లీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డుల్లో చేరాడు.

అంతేకాదు..ఐసీసీ టెస్ట్ లీగ్ లో ఆడిన ఐదుకు ఐదు టెస్టులు, రెండు సిరీస్ ల్లోనూ తిరుగులేని విజయాలతో…తొమ్మిదిజట్ల లీగ్ టేబుల్ టాపర్ గా నిలిపాడు. ప్రత్యర్థిజట్లను అత్యధికంగా ఎనిమిదిసార్లు ఫాలోఆన్ ఆడించిన కెప్టెన్ ఘనతను సైతం కొహ్లీ సొంతం చేసుకొన్నాడు.

సిరీస్ విజయాలలో ప్రపంచ రికార్డు…

టెస్టు క్రికెట్లో విరాట్ కొహ్లీ సారథిగా భారత్ స్వదేశీ గడ్డపై వరుసగా 11వ సిరీస్ విజయం సాధించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా పేరుతో ఉన్న పది వరుస సిరీస్ విజయాల ప్రపంచ రికార్డును భారత్ 11వ సిరీస్ విజయంతో తెరమరుగు చేసింది.

క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్మన్, మాస్టర్ సచిన్ టెండుల్కర్ ల పేరుతో ఉన్న ఒక్కో ప్రపంచ రికార్డును కొహ్లీ అధిగమిస్తూ వారేవ్వా అనిపించుకొన్నాడు. సౌతాఫ్రికాతో ముగిసినటెస్ట్ సిరీస్ రెండోటెస్టు రెండోరోజు ఆటలో పరుగుల మోత మోగించాడు. తన టెస్ట్ కెరియర్ లో 81 మ్యాచ్, కెప్టెన్ గా 50వ మ్యాచ్ ఆడిన కొహ్లీ…26వ సెంచరీని నమోదు చేశాడు.

2019 సీజన్ టెస్ట్ మ్యాచ్ ల్లో విరాట్ కొహ్లీకి ఇదే తొలిశతకం కావడం విశేషం. 254 పరుగుల అజేయ డబుల్ సెంచరీతో తన కెరియర్ లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.

డబుల్ సెంచరీలలో కొహ్లీ టాప్…

విరాట్ కొహ్లీ తన కెరియర్ లో 7వ డబుల్ సెంచరీ సాధించడం ద్వారా 7వేల పరుగుల క్లబ్ లో చేరాడు. 82 టెస్టుల్లో 7వేల 54 పరుగుల స్కోరుతో నిలిచాడు.

కెప్టెన్ గా తన కెరియర్ లో 50వ మ్యాచ్ ఆడుతూ ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్ గా నిలిచాడు. గతంలో ఇదే ఘనత సాధించిన వివిధ దేశాల కెప్టెన్లలో స్టీఫెన్ ఫ్లెమింగ్, మైకేల్ క్లార్క్, గ్రీమ్ స్మిత్ సైతం ఉన్నారు.

కెప్టెన్ గా అత్యధిక శతకాలు బాదిన ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరుతో ఉన్న రికార్డును సైతం విరాట్ కొహ్లీ తెరమరుగు చేశాడు. అంతేకాదు భారతజట్టు సారథిగా అత్యధిక సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ ఘనతను సైతం కొహ్లీ సొంతం చేసుకొన్నాడు.

డాన్ ను మించిన విరాట్…

టెస్ట్ క్రికెట్లో కెప్టెన్ గా 150కి పైగా స్కోరును…విరాట్ కొహ్లీ 9వసారి సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్ర్రేలియన్ క్రికెట్ లెజెండ్ డోనాల్డ్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న ఎనిమిది 150 స్కోర్ల రికార్డును అధిగమించాడు. కెప్టెన్ విరాట్ కొహ్లీ…336 బాల్స్ల్ లో 2 సిక్సర్లు, 33 బౌండ్రీలతో 254 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

టెస్ట్ క్రికెట్లో కొహ్లీకి ఇది 7వ డబుల్ సెంచరీ మాత్రమే కాదు…అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా కావడం విశేషం. టెస్ట్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత ఆటగాడి రికార్డును సైతం విరాట్ కొహ్లీ సొంతం చేసుకొన్నాడు.

మాస్టర్ సచిన్, బ్లాస్టర్ వీరేంద్ర సెహ్వాగ్ చెరో ఆరు డబుల్ సెంచరీలు చొప్పున సాధించగా…ఈ ఇద్దరి మొనగాళ్ల రికార్డును సైతం విరాట్ కొహ్లీ తెరమరుగు చేశాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన మొదటి నలుగురు ఆటగాళ్ల జాబితాలో విరాట్ కొహ్లీ 4వ స్థానంలో నిలిచాడు.

69 అంతర్జాతీయ శతకాలు…

అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కొహ్లీకి ఇది 69వ శతకం కావడం విశేషం. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలసి విరాట్ కొహ్లీ 69 సెంచరీలు బాదితే…ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో కలసి 71 శతకాలు నమోదు చేశాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించిన అసాధారణ రికార్డు ఉంది. 30 ఏళ్ల విరాట్ కొహ్లీ మరో 32 శతకాలు సాధించగలిగితే.. సచిన్ రికార్డును సైతం అధిగమించే అవకాశం ఉంటుంది.

భారతజట్టు కెప్టెన్ గా అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడి రికార్డును సైతం విరాట్ కొహ్లీ సొంతం చేసుకొన్నాడు. 2013 టెస్ట్ సిరీస్ లో ఆస్ట్ర్రేలియాపై అప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన 224 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును 254 నాటౌట్ స్కోరుతో విరాట్ కొహ్లీ తెరమరుగు చేశాడు.

థండర్ ఓపెనర్ రోహిత్ శర్మ

ఇప్పటి వరకూ వన్డే, టీ-20 ఫార్మాట్లలో మాత్రమే మెరుపు ఓపెనర్ గా పేరున్న రోహిత్ శర్మ…సౌతాఫ్రికాతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో సైతం థండర్ ఓపెనర్ గా రికార్డుల మోత మోగించాడు. రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో సహా 529 పరుగులు సాధించి… ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఓపెనర్ గా సెంచరీలు బాదిన భారత తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలిటెస్టు ద్వారా ఓపెనర్ అవతారమెత్తిన రోహిత్ శతకం సాధించడం ద్వారా…ఓ అసాధారణ రికార్డు తో మరో ఆరుగురు మొనగాళ్ల సరసన నిలిచాడు.

ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లలో ఓపెనర్ గా శతకాలు బాదిన భారత తొలి క్రికెటర్ గా, క్రికెట్ చరిత్రలో 7వ ప్లేయర్ గా రికార్డు సాధించాడు.

ఆధునిక క్రికెట్ చరిత్రలోని మూడు ఫార్మాట్లలో ఓపెనర్ గా సెంచరీలు బాదిన క్రికెటర్లలో…క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్, తిలకరత్నే దిల్షాన్, అహ్మద్ షెజాదే, షేన్ వాట్సన్, తమీమ్ ఇక్బాల్, రోహిత్ శర్మ ఉన్నారు.

రోహిత్ రికార్డుల వెల్లువ…

రాంచీ లోని జార్ఖండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతోముగిసిన ఆఖరి టెస్టులో రోహిత్ చెలరేగిపోయాడు. తన టెస్ట్ కెరియర్ లోనే తొలి డబుల్ సెంచరీతో వీరవిహారం చేశాడు. మొత్తం 255బాల్స్ ఎదుర్కొని 28 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 212 పరుగులతో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.

ఓపెనర్ గా తన మొట్టమొదటి టెస్ట్ సిరీస్ లోనే రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ సాధించడం ద్వారా…రోహిత్ శర్మ….క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న అత్యుత్తమ సగటు రికార్డును అధిగమించాడు.

స్వదేశీ టెస్టు సిరీస్ ల్లో డాన్ బ్రాడ్మన్ సాధించిన 98.22 సగటు రికార్డును రోహిత్ శర్మ99.84 సగటుతో అధిగమించాడు. గత 71 సంవత్సరాలుగా డాన్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న అత్యధిక సగటు రికార్డును రోహిత్ తెరమరుగు చేశాడు.

సిక్సర్ల బాదుడులో రోహిత్ టాప్…

టెస్టు క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ ప్రపంచ రికార్డును రోహిత్ శర్మ తనపేరుతో లిఖించుకొన్నాడు. వెస్టిండీస్ మిడిలార్డర్ ఆటగాడు సిమ్ రాన్ హెట్ మేయర్ పేరుతో ఉన్న రికార్డును రోహిత్ అధిగమించాడు. బంగ్లాదేశ్ తో ముగిసిన 2018-19 టెస్టు సిరీస్ లో హెట్ మేయర్ 15 సిక్సర్లు బాదడం ద్వారా రికార్డు సాధించాడు. ఆ రికార్డును రోహిత్ శర్మ 19 సిక్సర్లతో తెరమరుగు చేశాడు.

హేమాహేమీల సరసన రోహిత్…

ఓ క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు సాధించిన మరో నలుగురు దిగ్గజ ఓపెనర్ల సరసన రోహిత్ శర్మ చోటు సంపాదించాడు.

1998 సీజన్లో సచిన్.. 33 మ్యాచ్ ల్లో 9 శతకాలు బాదితే…2005లో సౌతాఫ్రికా కెప్టెన్ గ్రీమ్ స్మిత్ 34 టెస్టుల్లో 9 సెంచరీలు, 2016 సీజన్లో ఆస్ట్ర్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 37 టెస్టుల్లో 9 సెంచరీలు, 2019 సీజన్లో రోహిత్ శర్మ 9 సెంచరీలు సాధించి .. మొదటి నాలుగుస్థానాల్లో నిలిచారు.1996లో సౌతాఫ్రికా ఓపెనర్ గ్యారీ కిర్ స్టెన్ 32 టెస్టుల్లో 8 సెంచరీలతో ఉన్నాడు.

భారత 5వ ఓపెనర్ రోహిత్..

వన్డే క్రికెట్ తో పాటు టెస్టు క్రికెట్లో సైతం డబుల్ సెంచరీలు నమోదు చేసిన భారత మాజీ ఓపెనర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ల సరసన రోహిత్ శర్మ నిలిచాడు.

ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో 500 పరుగులు సాధించిన భారత 5వ ఓపెనర్ గా కూడా రోహిత్ రికార్డుల్లో చేరాడు. సునీల్ గవాస్కర్, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్, బుదీ కుందరన్ గతంలోనే..ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లుగా ఉన్నారు.

భారత గడ్డపై రోహిత్ శర్మ ఆడిన మొత్తం 18 ఇన్నింగ్స్ లో 6 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాధించడమే కాదు…గత తొమ్మిది ఇన్నింగ్స్ లో 82 నాటౌట్, 51 నాటౌట్, 102 నాటౌట్, 65, 50 నాటౌట్, 176, 127, 14, 212 స్కోర్లు నమోదు చేశాడు.

ఇటు వండర్ కెప్టెన్ విరాట్ కొహ్లీ..అటు థండర్ ఓపెనర్ రోహిత్ శర్మ అత్యుత్తమస్థాయిలో రాణించినంత కాలం…భారత క్రికెట్ కు తిరుగేలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  27 Oct 2019 6:17 AM GMT
Next Story