`ఆవిరి` హార‌ర్ చిత్రం కాదు…. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్

హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆవిరి సినిమా నిజానికి హారర్ మూవీ కాదంటున్నాడు దర్శకుడు రవిబాబు. హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎవర్నీ భయపెట్టదని, కేవలం థ్రిల్ మాత్రమే ఇస్తుందని చెబుతున్నాడు. అందుకే దీన్ని ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెబుతున్నాడు. న‌వంబర్ 1న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా గురించి రవిబాబు ఏమంటున్నాడో చూద్దాం…

– `ఆవిరి` సినిమా హార‌ర్ సినిమా కాదు. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌. నేను ఇంత‌కు ముందు తీసిన సినిమాల‌న్నీ కూడా థ్రిల్ల‌ర్ సినిమాలే. క‌థ‌ను చెప్ప‌డంపైనే నేను ఫోక‌స్ పెడ‌తాను. ప్రేక్ష‌కుల‌ను ఏదో భ‌య‌పెట్టాల‌ని ఆలోచించ‌ను. ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెడితేనే ప్రేక్ష‌కులు థ్రిల్ అవుతార‌ని ఎప్పుడూ అనుకోలేదు.

– `అదుగో` సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి నాకు రెండున్న‌రేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. ఆ స‌మ‌యంలో ఎలాంటి సినిమా చేయాల‌ని బాగా ఆలోచించేవాడిని. ఆ స‌మ‌యంలో వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి ఇంట్లో దెయ్యం ఉంద‌నే క‌థ‌నాన్ని పేప‌ర్‌లో చూశాను. ఆ స్టోరీ చ‌దివిన త‌ర్వాత నాకొక ఆలోచన వ‌చ్చింది. ఇదొక ఫిక్ష‌న‌ల్ స్టోరీ.

– ఈ సినిమాలో పాప తండ్రి పాత్ర‌ను ఎవ‌రితో చేయించాల‌నే దానిపై నేను, స‌త్యానంద్‌గారు పెద్ద డిస్క‌ష‌న్ చేసుకున్నాం. ఆ క్ర‌మంలో నువ్వే చెయ్యి అని స‌త్యానంద్‌గారు అన్నారు. నేను డైరెక్ష‌న్‌, ప్రొడ‌క్ష‌న్ చేస్తూ సినిమా చేయ‌డ‌మ‌నేది క‌ష్ట‌మ‌వుతుందేమోనని అనుకున్నాను. అయితే ఇది వ‌ర‌కు నువ్వు డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేశావ్ క‌దా! మీ వెనుక మేమున్నాం అంటూ స‌త్యానంద్‌గారు చెప్ప‌డంతో యాక్ట్ చేయాల‌నుకున్నాను.