Telugu Global
National

దుష్యంత్‌లు లేరిక్కడ... చేతనైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి...

మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకునేందుకు బీజేపీ ససేమిరా అంటుండడంతో శివసేన కూడా అంతే తీవ్రంగా స్పందిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని పంచుకునే విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని శివసేన తేల్చిచెప్పింది. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న భావనతో ఉన్న శివసేన … బీజేపీకి ధీటుగానే బదులిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని పంచుకునే ప్రసక్తే లేదని… ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలకు శివసేన […]

దుష్యంత్‌లు లేరిక్కడ... చేతనైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి...
X

మహారాష్ట్రలో బీజేపీ- శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకునేందుకు బీజేపీ ససేమిరా అంటుండడంతో శివసేన కూడా అంతే తీవ్రంగా స్పందిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని పంచుకునే విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని శివసేన తేల్చిచెప్పింది.

ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదన్న భావనతో ఉన్న శివసేన … బీజేపీకి ధీటుగానే బదులిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని పంచుకునే ప్రసక్తే లేదని… ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలకు శివసేన స్పందించింది.

హంగ్ వస్తే ముఖ్యమంత్రి పదవిని చెరిసగం పంచుకునే ప్రతిపాదనకు అమిత్ షా ఎన్నికల ముందే అంగీకరించారని శివసేన గుర్తు చేస్తోంది. ప్రతిష్టంభన నేపథ్యంలో బీజేపీ పెద్దలకు- శివసేన పెద్దలకు మధ్య జరగాల్సిన భేటీ రద్దు అయింది.

అసెంబ్లీలో బీజేపీకి సరిపడ సంఖ్యాబలం ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని శివసేన సవాల్ చేసింది. బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే ఎవరూ అడ్డుకోబోరని స్పష్టం చేసింది. మహారాష్ట్రంలో దుష్యంత్‌ లు ఎవరూ లేరన్న విషయం గుర్తుంచుకోవాలని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

జైలుకెళ్లిన తండ్రి ఉన్న దుష్యంత్‌ చౌతాలా వంటి వారు మహారాష్ట్రలో లేరని… అందుకే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. ఇక్కడ న్యాయం, ధర్మం ఆధారంగా మాత్రమే నడుచుకునే శివసేన ఉందని… హర్యానా, మహారాష్ట్రలలో పరిస్థితులు వేర్వేరు అని బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మద్దతు అవసరం లేదని బీజేపీ చెబితే ఆ మరుక్షణమే నిర్ణయం తీసుకునేందుకు శివసేన సిద్ధంగా ఉందని ఆ పార్టీ ప్రకటించింది. దీంతో మహారాష్ట్రలో ప్రతిష్టంభన అంత సులువుగా వీగిపోయే సూచనలు కనిపించడం లేదు.

First Published:  30 Oct 2019 12:10 AM GMT
Next Story