లాలూ బ‌యోపిక్ ‘లాంత‌ర్’…. మ‌రి జైలు సీన్లు ఉంటాయా?

బాలీవుడ్ లో బ‌యోపిక్‌ల సీజ‌న్ న‌డుస్తోంది. సంజ‌య్‌ద‌త్‌, సానియా మీర్జా, క‌పిల్‌దేవ్‌ లతో పాటు ప‌లువురు సినిమా తార‌ల బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతున్నాయి. ఎన్నిక‌ల టైమ్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ బ‌యోపిక్ కూడా రిలీజ్ చేశారు.

ఇప్పుడు బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ జీవితం కూడా సినిమా రూపంలో రాబోతుంది. లాలూ లైఫ్‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీయ‌బోతున్నారు. ఈ సినిమాకు ఇప్ప‌టికే ‘లాంత‌ర్’ అని పేరు పెట్టారు. లాలూ పార్టీ రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్. ఆ పార్టీ గుర్తు ‘లాంత‌ర్‌’. దీంతో ఆ గుర్తునే ఇప్పుడు లాలూ బ‌యోపిక్‌కు కూడా పెట్టారు.

లాలూ ప్ర‌సాద్‌ను పోలిన పాత్ర‌లు ఇంత‌కుముందు బాలీవుడ్‌లో వ‌చ్చాయి. కొన్ని కామెడీ రోల్స్‌కు లాలూ ప్రేర‌ణ‌గా నిలిచారు. అయితే దాణా స్కామ్‌లో దోషిగా తేలిన లాలూ ప్ర‌స్తుతం జైలులో ఉన్నారు. ఆర్జేడీ పార్టీని కొడుకు తేజ‌స్వి యాద‌వ్ చూస్తున్నారు.

లాలూ క్యారెక్టర్‌ లో ప్రముఖ భోజ్‌పురి నటుడు యష్ కుమార్ నటిస్తున్నారు. లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి పాత్రలో స్మృతి సిన్హా నటించనున్నారు.

దేశ రాజ‌కీయాల్లో లాలూ స్టైలే వేరు. ఆయ‌న సీఎంగా ఉన్న కాలంలోనే నోట్లో వేప పుల్ల‌తో క‌నిపించేవారు. ఆవు పాలు పిండే ఫోటోలు ద‌ర్శ‌నిమ‌చ్చేవి.

స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన లాలూ…..ఆ త‌ర్వాత బీహార్‌ సీఎంగా ఎదిగారు. ఆర్జేడీ సామ్రాజ్యాన్ని విస్త‌రించారు.

అయితే బీహార్ విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న పార్టీ జార్ఖండ్‌లో లేకుండా పోయింది. బీహార్‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. 2010 వ‌ర‌కు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన లాలూ… ఆత‌ర్వాత ఎదురుదెబ్బ‌లు తగిలాయి. ఫ్యామిలీ ప‌రంగా పెద్ద కొడుకు కామెడీ వేషాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

మొత్తానికి లాలూ బ‌యోపిక్‌లో జ‌నానికి కావాల్సిన మ‌సాలా చాలా ఉండే అవ‌కాశం ఉంది. కామెడీ పంచ్‌ల నుంచి కారాగారం దాకా ఆయ‌న జీవితంలో చాలా మ‌లుపులు ఉన్నాయి. ఇవ‌న్నీ తెర‌పై చూపిస్తే ప్రేక్ష‌కుల‌కు పండ‌గే.