Telugu Global
National

ఇసుక అమ్మ‌కం ఫొటో వెనుక అస‌లు క‌థేంటి?

పైన ఫొటో చూశారా? ఇసుక అమ్మే ఫొటో. ఈ ఫొటోను ప‌ట్టుకుని ఏపీలో ఇసుక బంగారం అయిపోయింది. కిలోకు 20 రూపాయ‌ల చొప్పున అమ్ముతున్నారు…. ఒక గ్లాస్ ప‌ది రూపాయ‌లు అయింది అంటూ సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి ఈ ఫొటో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఏపీలో ఇప్పుడు ఇసుక దొర‌క‌వ‌డం లేదని..ఇలా కిలోల లెక్క అమ్ముతున్నార‌ని కొంద‌రు నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. అస‌లు ఫొటో వెనుక క‌థ […]

ఇసుక అమ్మ‌కం ఫొటో వెనుక అస‌లు క‌థేంటి?
X

పైన ఫొటో చూశారా? ఇసుక అమ్మే ఫొటో. ఈ ఫొటోను ప‌ట్టుకుని ఏపీలో ఇసుక బంగారం అయిపోయింది. కిలోకు 20 రూపాయ‌ల చొప్పున అమ్ముతున్నారు…. ఒక గ్లాస్ ప‌ది రూపాయ‌లు అయింది అంటూ సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం చేస్తున్నారు.

రెండు రోజుల నుంచి ఈ ఫొటో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఏపీలో ఇప్పుడు ఇసుక దొర‌క‌వ‌డం లేదని..ఇలా కిలోల లెక్క అమ్ముతున్నార‌ని కొంద‌రు నెగిటివ్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. అస‌లు ఫొటో వెనుక క‌థ తెలిసి… ఇప్పుడు అంద‌రూ అవాక్కు అవుతున్నారు.

తెలంగాణ‌లో పెద్దపల్లి జిల్లాలోని మంథ‌నిలో ఇసుకను డబ్బాల చొప్పున అమ్ముతున్న ఫొటో ఇది. దీపావ‌ళి రోజు స్థానిక ప‌త్రిక‌లో ఈ ఫొటో ప్ర‌చురిత‌మైంది. దీన్ని సోష‌ల్‌మీడియాలో కొంద‌రు పోస్టు చేసి సొంత కామెంట్ల‌తో ఊద‌ర‌గొట్టారు.

రెండు రోజుల్లో ఈ ఫొటో రాజ‌కీయ రంగు పులుముకుంది. చివరకు ఆ ఫొటో ఎక్కడిదో, ఎందుకు అలా అమ్మాల్సి వచ్చిందో అన్న అసలు సంగతి మరుగున పడిపోయింది.

తెలంగాణలో దీపావళి పండుగ మొదలుకొని.. కార్తీకపౌర్ణమి దాకా కేదారేశ్వరస్వామి నోములు, వ్రతాలు జరుపుకోవడం ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినా, పట్టణ ప్రాంతాల్లో చూసినా దాదాపు 70శాతం మంది కేదారేశ్వరస్వామి నోము నోచుకుంటారు.

ఆ వ్రతంలో భాగంగా.. పవిత్రమైన నోము పాత్రలను గొలుసు (పారేనీళ్లలో అడుగున ఉండే ఇసుక) పైన ఉంచుతారు. యేడాది పాటు.. అత్యంత పవిత్రంగా ఉట్టిమీద ఉంచే నోము కుండలను కిందికి దింపి.. పారే నీళ్లలో నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇసుక (గొలుసు)పైనే ఉంచుతారు. కింద అస్సలు పెట్టరు. అది ఇక్కడి సాంప్రదాయం.

గోదావరి పరీవాహకం ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లోని జనం గోదావరి ప్రవాహంలోని గొలుసు (ఇసుక)ను నోము నోచుకునే రోజు ఉదయాన్నే నదీస్నానమాచరించి తీసుకొచ్చి నోము కుండల కింద పేర్చుతారు. అయితే.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా కాళేశ్వరం నుంచి మొదలుకొని ఎగువన గోదావరిఖని, శ్రీపాద సాగర్‌ ప్రాజెక్టు దాకా గోదావరి నిండుకుండలా ఉంది.

గతంలో అయితే.. ఈ సమయంలో పాయలు పాయలుగా ప్రవాహం ఉండేది. ఇప్పుడు పూర్తిగా గోదావరి నిండిపోవడంతో.. ఈ సంస్కృతి, సఆంప్రదాయం గురించి తెలిసిన మంథని ఆవల మంచిర్యాల జిల్లా, మహారాష్ట్రకు చెందిన కొందరు.. అక్కడి నదులు, ఏరులలో ఇసుకను తీసుకొచ్చి.. నోము పాత్రలకోసం చిన్నడబ్బా ఇసుక రూ.10 చొప్పున అమ్మారు. ఆ గొలుసు ప్రాధాన్యం తెలిసిన, నోములు నోచుకునే వాళ్లు.. కొనుక్కెళ్లారు.

ఈవిష‌యం తెలియ‌ని కొంద‌రు జ‌నాలు ఈ ఫొటోతో ఇసుక వ్యాపారం మొదలు పెట్టారు. ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కామెంట్స్ చేసి రైట‌ప్‌లు రాశారు. తెలంగాణ‌లో కేదారేశ్వ‌ర వ్ర‌తం కోసం ఉప‌యోగించే ఇసుకకు రాజ‌కీయ రంగు పులిమారు. మొత్తానికి ఏపీలో ప్ర‌తీది వింతే అవుతుంది. రాజ‌కీయ రంగు వేయ‌డ‌మే స‌రిపోతుంది.

First Published:  30 Oct 2019 8:30 PM GMT
Next Story