శృతిహాసన్ రీఎంట్రీకి రెడీ

బాయ్ ఫ్రెండ్ కోర్సల్ తో కొన్నాళ్లుగా డేటింగ్ చేసిన శృతిహాసన్ పూర్తిగా సినిమాలకు దూరమైంది. గతేడాది ఆమె ఒక్క సినిమాలో కూడా నటించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ గ్యాప్ లో ఆమె ఓ మ్యూజిక్ వీడియో చేసింది. ఈ సంగతి పక్కనపెడితే..మళ్లీ ఇన్నేళ్లకు శృతిహాసన్ కు నటించాలనే కోరిక కలిగింది. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఫ్రెష్ గా టాలీవుడ్ సినిమాకు కూడా కాల్షీట్లు కేటాయించింది.

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రవితేజ సినిమాతో మరోసారి తెలుగుతెరపైకి రాబోతోంది శృతిహాసన్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో గోపీచంద్-రవితేజ-శృతిహాసన్ కాంబోలో బలుపు అనే సినిమా వచ్చింది. ఇది రెండో మూవీ.

ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు రవితేజ. గతంలో పలు సినిమాల్లో పోలీస్ గా కనిపించినప్పటికీ.. ఈసారి మరింత ఎనర్జిటిక్ గా ఈ పాత్ర ఉంటుందంటున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.