Telugu Global
NEWS

టాప్ గేర్ లో భారత పేస్ బౌలింగ్ ఎటాక్

ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలింగ్ ఫోర్స్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ స్పిన్ బౌలర్లకు చిరునామాగా ఉండే భారత గడ్డపై…ఫాస్ట్ బౌలర్ల హవా ప్రారంభమయ్యింది. ఐదుగురు అత్యుత్తమ స్వింగ్, ఫాస్ట్ బౌలర్ల దళం… ప్రత్యర్థిజట్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. స్వదేశీ, విదేశీ …పేస్, స్పిన్ వికెట్లు అన్న తేడా లేకుండా..ఎప్పుడైనా, ఎక్కడైనా 20 వికెట్లు పడగొట్టడానికి తాము సిద్ధమని భారత ఫాస్ట్ బౌలర్లు తమ కుదురైన బౌలింగ్ తో చెప్పకనే చెబుతున్నారు. కొహ్లీ కెప్టెన్సీలో ఫాస్ట్ బౌలర్ల […]

టాప్ గేర్ లో భారత పేస్ బౌలింగ్ ఎటాక్
X
  • ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పేస్ బౌలింగ్ ఫోర్స్
  • గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్

స్పిన్ బౌలర్లకు చిరునామాగా ఉండే భారత గడ్డపై…ఫాస్ట్ బౌలర్ల హవా ప్రారంభమయ్యింది. ఐదుగురు అత్యుత్తమ స్వింగ్, ఫాస్ట్ బౌలర్ల దళం… ప్రత్యర్థిజట్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

స్వదేశీ, విదేశీ …పేస్, స్పిన్ వికెట్లు అన్న తేడా లేకుండా..ఎప్పుడైనా, ఎక్కడైనా 20 వికెట్లు పడగొట్టడానికి తాము సిద్ధమని భారత ఫాస్ట్ బౌలర్లు తమ కుదురైన బౌలింగ్ తో చెప్పకనే చెబుతున్నారు.

కొహ్లీ కెప్టెన్సీలో ఫాస్ట్ బౌలర్ల దూకుడు..

విరాట్ కొహ్లీ నాయకత్వంలో…భారత ఫాస్ట్ బౌలర్ల దళం చెలరేగిపోతోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. లంబూ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిప్పులు చెరిగే మెరుపు పాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా, స్వింగ్ బౌలింగ్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్, రివర్స్ స్వింగ్ కింగ్ మహ్మద్ షమీలతో…. భారత పేస్ ఎటాక్ అత్యుత్తమంగా రాణిస్తూ… టెస్ట్ క్రికెట్లో భారత్ ప్రపంచ నంబర్ వన్ గా నిలవడం లో తనవంతు పాత్ర నిర్వర్తిస్తోంది.

స్వదేశంలో భారత పేసర్ల జోరు..

స్వదేశీ మందకొడి పిచ్ ల పైన సైతం భారత ఫాస్ట్ బౌలర్లు అంచనాలకు మించి రాణిస్తూ వారేవ్వా అనిపించుకొంటున్నారు. విరాట్ కొహ్లీ నాయకత్వంలో… భారతగడ్డపై ఆడిన 24 టెస్టుల్లో ఫాస్ట్ బౌలింగ్ దళం ఏకంగా 137 వికెట్లు పడగొట్టింది. 27.44సగటు, 57.2 స్ట్ర్రయిక్ రేట్ సాధించింది.

2017 నవంబర్ నుంచి స్వదేశీ పిచ్ లపైన ఆడిన ఎనిమిది టెస్టుల్లోనే భారత పేసర్లు 69 వికెట్లు పడగొట్టడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

2015 టు 2019

2015లో భారత టెస్ట్ జట్టు కెప్టెన్ గా విరాట్ కొహ్లీ పగ్గాలు చేపట్టిన నాటినుంచి..బుమ్రా, ఇశాంత్ ,భువనేశ్వర్ కుమార్, షమీ, ఉమేశ్ యాదవ్ లు కలసి…52 టెస్టుల్లో 428 వికెట్లు పడగొట్టారు. ఇందులో 16 ఐదు వికెట్ల రికార్డు సైతం ఉండటం చూస్తే… భారత పేసర్ల జోరు ఏ స్థాయిలో ఉందీ మరి చెప్పాల్సిన పనిలేదు.

విదేశీ గడ్డపై ఆడిన 26 టెస్టుల్లో 152 వికెట్లు, స్వదేశంలో ఆడిన 26 టెస్టుల్లో 276 వికెట్లు పడగొట్టారు.

బుమ్రా అందుబాటులో లేకున్నా…

సౌతాఫ్రికాతో ముగిసిన తీన్మార్ టెస్ట్ సిరీస్ కు యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకున్నా..పేసర్ల జోడీ షమీ, ఉమేశ్ ఆ లోటు లేకుండా తమ అత్యుత్తమ బౌలింగ్ తో పూడ్చగలిగారు.

జీవంలేని పూణే, రాంచీ వికెట్లపై ఉమేశ్ యాదవ్ గంటకు 150 కిలోమీటర్ల సగటు వేగంతో సఫారీ బ్యాటింగ్ లైనప్ ను కకావికలు చేయగలిగాడు.

ఇక.. మహ్మద్ షమీ మూడు టెస్టుల్లోనూ రివర్స్ స్వింగ్ తో విశ్వరూపమే ప్రదర్శించి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. సౌతాఫ్రికాతో సిరీస్ లో భారత బౌలర్లు పడగొట్టిన మొత్తం 60 వికెట్లలో పేసర్లే 26 వికెట్లు సాధించారు.

కొహ్లీ నాయకత్వంలో…

భారత టెస్టు జట్టు కెప్టెన్ గా విరాట్ కొహ్లీ నాయకత్వంలో ఆడిన మొత్తం 51 టెస్టుల్లో…భారత పేసర్లు మొత్తం 420 వికెట్లు పడగొట్టారు. ఇందులో స్వదేశంలో ఆడిన 24 టెస్టుల్లో 137 వికెట్లు, విదేశీ గడ్డపై ఆడిన 27 టెస్టుల్లో 283 వికెట్లు ఉన్నాయి.

విదేశీ సిరీస్ ల్లో భారత బౌలర్లు 13సార్లు ఐదేసి వికెట్ల రికార్డు సాధిస్తే…స్వదేశీ సిరీస్ ల్లో మాత్రం మూడుసార్లే 5 వికెట్ల రికార్డు నమోదు చేయగలిగారు.

మహ్మద్ షమీ టాప్…

ఇక…వ్యక్తిగతంగా చూస్తే…భారత ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా మహ్మద్ షమీ నిలిచాడు. షమీ ఆడిన మొత్తం 35 టెస్టుల్లో 128 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగుసార్లు 5 వికెట్ల రికార్డు సైతం ఉంది.

ఇశాంత్ శర్మ 33 టెస్టుల్లో 90 వికెట్లు, ఉమేశ్ యాదవ్ 30 టెస్టుల్లో 79 వికెట్లు, జస్ ప్రీత్ బుమ్రా 12 టెస్టుల్లోనే 62 వికెట్లు సాధించడం ద్వారా మొదటి నాలుగుస్థానాలలో నిలిచారు. బుమ్రా ఐదుసార్లు ఐదేసి వికెట్ల రికార్డు నమోదు చేశాడు.

గతంలో ఎన్నడూ లేనంతగా అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉండటం, ఫిట్ నెస్ గణనీయంగా మెరుగుపడటం, ఏకకాలంలో ఐదుగురు అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉండటమే కాదు…జట్టులో స్థానం కోసం పోటీపడటం…భారత ఫాస్ట్ బౌలింగ్ ప్రమాణాలు మెరుగుపడటానికి కారణమని…పలువురు ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజాలు చెబుతున్నారు.

ఏది ఏమైనా…ఎనిమిది దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం ఫాస్ట్ బౌలర్లకు స్వర్ణయుగం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  31 Oct 2019 7:19 PM GMT
Next Story