Telugu Global
National

లక్ష్మణ రేఖ ఉండాలని రామోజీరావు కూడా అంగీకరించారు...

మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా లేదా అన్న దానిపై చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ జర్నలిస్ట్‌ అమర్. ప్రభుత్వం మీడియా స్వేచ్చను హరిస్తోందంటూ టీడీపీ అనుకూల పత్రికలు పెద్దెత్తున కథనాలు రాస్తున్న నేపథ్యంలో… అమర్ మీడియా సమావేశం నిర్వహించారు. 2005లోనే మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా వద్దా అంశంపై ఏపీ ప్రెస్‌ అకాడమీ జాతీయ సదస్సును నిర్వహించిందన్నారు. ఆ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ […]

లక్ష్మణ రేఖ ఉండాలని రామోజీరావు కూడా అంగీకరించారు...
X

మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా లేదా అన్న దానిపై చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ జర్నలిస్ట్‌ అమర్. ప్రభుత్వం మీడియా స్వేచ్చను హరిస్తోందంటూ టీడీపీ అనుకూల పత్రికలు పెద్దెత్తున కథనాలు రాస్తున్న నేపథ్యంలో… అమర్ మీడియా సమావేశం నిర్వహించారు.

2005లోనే మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా వద్దా అంశంపై ఏపీ ప్రెస్‌ అకాడమీ జాతీయ సదస్సును నిర్వహించిందన్నారు. ఆ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఉన్న సీనియర్ జర్నలిస్టులను ఆహ్వానించామన్నారు. ఈనాడు పత్రికాధిపతి రామోజీ రావు కూడా ఆ సదస్సుకు హాజరయ్యారన్నారు.

మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా లేదా అన్న దానిపై ఒక రోజంతా చర్చిస్తే రామోజీ రావు కూడా మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారన్నారు. ఆ రేఖను మీడియానే స్వయంగా గీసుకోవాలని… ఆ సమావేశంలో నిర్ణయానికి వచ్చామన్నారు. కానీ ఆ తర్వాత కూడా మీడియా వైఖరిలో మార్పు రాలేదన్నారు.

దేశంలో స్వేచ్చ అన్నది అందరికీ సమానమేనని… మీడియాకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఎలాంటి ప్రత్యేక హక్కులు, స్వేచ్చ లేదన్నారు. అయినా సరే ప్రజాస్వామ్యంలో ప్రతికా స్వేచ్చను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని అమర్ అభిప్రాయపడ్డారు. కానీ ఆ స్వేచ్చ వాస్తవాలను రాసే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలన్నారు. వాస్తవంతో సంబంధం లేకుండా రాజకీయ లక్ష్యాలతో, వ్యాపార ప్రయోజనాలతో తప్పుడు కథనాలు రాసినా సరే ఉపేక్షించాలనడం సరికాదన్నారు.

వ్యక్తులు, ప్రభుత్వాలకు సంబంధించి తప్పుడు కథనాలు రాస్తే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికే కాకుండా, వ్యక్తులకు కూడా రాజ్యాంగం ప్రసాదించిందన్నారు. మీడియా ఏమీ పైనుంచి దిగివచ్చింది కాదని… ప్రజల కోసం పనిచేసే వరకు మీడియా స్వేచ్చను గౌరవించాల్సిందేనన్నారు. కానీ స్వేచ్చను అలుసుగా తీసుకుని, ఆయుధంగా తీసుకుని అసత్యాలు ప్రచారం చేస్తూ, బురదజల్లే చర్యలకు దిగితే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కూడా అలాంటి తప్పుడు వార్తలు రాసే వారి కోసమే తెచ్చినది అని అమర్ చెప్పారు. అసలు ఈ జీవో ఇప్పుడు తెచ్చింది కాదన్నారు. ఈ జీవోను చంద్రబాబు కూడా వాడుకున్నారన్నారు. గతంలో కేవలం ఐ అండ్ పీఆర్‌ కమిషనర్‌కు మాత్రమే కేసులు వేసే అధికారం ఉండేదని… ఇప్పుడు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆ అధికారం ఇస్తూ కొన్ని సవరణలు మాత్రమే చేశారన్నారు. ఒకరి చేతిలో ఉన్న అధికారాన్ని పలువురికి పంచితే మంచిదే కదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వం కూడా జర్నలిస్టులపై కేసులు వేసి, పరువు నష్టం దావాలు వేసిందని అమర్ గుర్తు చేశారు. తప్పుడు కథనాలు రాయనప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వార్త వాస్తవంగా రాయాలని… అభిప్రాయం వెలిబుచ్చేందుకు స్వేచ్చ ఉంటుందని… కానీ తప్పుడు వార్తలను రాసే అధికారం ఎవరికీ ఉండదన్నారు.

తప్పుడు వార్తలపై సవరణ వేయాల్సిందిగా కోరినా ఇప్పుడు మీడియా సంస్థలు అంగీకరించడం లేదన్నారు. ప్రజల మీదకు పనిగట్టుకుని తప్పుడు వార్తలు వదులుతూ ఉంటే ఏ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. నిజాలు రాసే వారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని… ఏపీలో పత్రికా స్వేచ్చకు వచ్చిన ముప్పేమీ లేదన్నారు అమర్.

First Published:  1 Nov 2019 10:47 AM GMT
Next Story