అమెరికన్ పోలీస్ గా అంజలి

అంజలికి ఇప్పుడు మెయిన్ హీరోయిన్ పాత్రలు రావడం తగ్గిపోయాయి. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలేమైనా చేస్తే చేయాలి. లేదంటే ఇతర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాలి. ప్రస్తుతం ఆమె కూడా ఇదే పనిలో ఉంది. పైగా టాలీవుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు ఇప్పించగలగే కోన వెంకట్ ఉండనే ఉన్నారు. ఆ రిఫరెన్స్ తోనే అంజలి మరో ఛాన్స్ కొట్టేసింది. ఈసారి ఆమె పోలీసాఫీసర్ గా కనిపించనుంది.

కోన వెంకట్ నిర్మాతగా అనుష్క మెయిన్ లీడ్ లో నిశ్శబ్దం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అంజలి కూడా నటిస్తోంది. ఆమె పాత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోలీసాఫీసర్ మాయగా అంజలి ఈ సినిమాలో కనిపించనుంది. నిజానికి ఆమె ఇండియన్ పోలీస్ కాదు. అమెరికన్ క్రైమ్ డిటెక్టివ్ గా ఆమె కనిపించనుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనుష్క, మాధవన్ లుక్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు అంజలి లుక్ కూడా వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా నుంచి అవసరాల శ్రీనివాస్, షాలినీ పాండే లుక్స్ ను కూడా విడుదల చేయబోతున్నారు.

హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో నిశ్శబ్దం సినిమాను విడుదల చేయబోతున్నారు.